AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

స్థానికుల మానవత్వం.. బాధితులను ఆదుకునేందుకు తరలివచ్చిన జనం

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొన్న ఘటన వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ విపత్కర పరిస్థితుల్లో గాయపడిన వారికి రక్తం అవసరం ఉంటుందని ఆలోచించిన వందలాదిమంది యువకులు రాత్రికి రాత్రే బాలేశ్వర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. వీరంతా ఏ పిలుపూ లేకుండానే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. గంటల తరబడి వేచి ఉండి మరీ.. క్షతగాత్రులకు రక్తదానం చేస్తున్నారు.

ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే స్థానికులు మానవత్వంతో స్పందించి, అనేక విధాలుగా అధికారులకు సహాయపడ్డారు. గాయపడినవారికి చికిత్స చేయడానికి రక్తం అవసరం అవుతుంది కాబట్టి, బాలాసోర్‌లోని ఆసుపత్రులకు వెళ్లి రక్తదానం చేయడానికి వందలాది మంది బారులు తీరారు. ఆసుపత్రుల్లో చేరిన క్షతగాత్రుల ఆర్తనాదాలు ఓవైపు, రక్తదానం చేయడానికి వచ్చినవారిలో ఉప్పొంగుతున్న మానవత్వం మరోవైపు, ఈ సన్నివేశాలను చూసినవారి హృదయం ద్రవిస్తోంది.

బాలాసోర్ పరిసర ప్రాంతాల ప్రజలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి మాత్రమే కాకుండా వారి బంధువులకు కూడా సేవలందిస్తున్నారు. శుక్రవారం రాత్రి దాదాపు 2,000 మంది స్థానికులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి బాలాసోర్ వైద్య కళాశాల, ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వీరిలో పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. రాత్రి 500 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా ట్వీట్ చేశారు. మరో 900 యూనిట్ల రక్తం నిల్వ ఉందని తెలిపారు. అత్యుత్తమ ప్రయోజనం కోసం స్వచ్ఛందంగా రక్తదానం చేసినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ANN TOP 10