సిద్ధిపేట ప్రజల ఏళ్ల నాటి కల నెరవేరనుంది. త్వరలోనే పట్టణంలో రైలు కూత పెట్టనుంది. ఇప్పటికే గజ్వల్ వరకు ట్రాక్ పనులు పూర్తికాగా ట్రయల్ రన్ కూడా జరిగింది. ఇక త్వరలోనే సిద్ధిపేటలో కూడా రైలు రానుంది. ప్రస్తుతం ట్రాక్ పనులు యుద్ధప్రాతిపదిక జరుగుతున్నాయి. జూలై చివరి నాటికి లేదా ఆగస్టు మొదటి వారంలో పనులు పూర్తి చేయాలని అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ట్రాక్ నిర్మాణ పనులను స్వయంగా పర్యవేక్షించారు.
యుద్ధప్రాతిపదిక ట్రాక్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు రైల్వే అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. రైల్వే ట్రాక్ పనుల్లో జాప్యం జరుగొద్దని, పనుల వేగం పెంచాలని సూచించారు. సిద్దిపేట శివారులోని మందపల్లి నుంచి రైల్వేట్రాక్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రైల్వే శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సంతోశ్ కుమార్‌తో కలిసి మంత్రి హరీశ్ రావు పరిశీలించారు.









