AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జూబ్లీహిల్స్‌లో ఆదిమానవుని ఆనవాళ్లు..

నగరంలోని జూబ్లీహిల్స్ పరిధిలోని బిఎన్ఆర్ హిల్స్ వద్ద గల తాబేలు గుండు కింద కొత్త రాతియుగపు ఆనవాళ్లను గుర్తించినట్లు పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డా॥ ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్, శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. జూబ్లీ హిల్స్ పరిసరాల్లోని విచిత్ర రాతి ఆకారాల (రాక్ ఫార్మేషన్స్) సందర్శనలో భాగంగా శనివారం నాడు బిఎన్ఆర్ హిల్స్ దారిలో ఉన్న తాబేలుగుండును పరిశీలిస్తుండగా, గుండు కింద నేల పరుపు సందులో రెండు కొత్త రాతియుగపు రాతి గొడ్డళ్లు కనిపించాయని తెలిపారు.

సులువుగా ఆహార సంపాదన కోసం నైపుణ్యంతో తయారు చేసుకొన్న ఈ రాతి గొడ్డళ్లు కొత్త రాతియుగపు మానవుల సాంకేతిక ప్రగతిని తెలియజేస్తున్నాయనీ, చుట్టూ ఉన్న నీటి వనరులతో వ్యవసాయం, పశుపాలన ముఖ్య వృత్తులుగా గల నాటి మానవులకు తాబేలుగుండు తాత్కాలిక నివాస స్థావరమనీ వారు తెలిపారు.

ఒకవైపు రెండు, మరోవైపు ఒకటి 6 అడుగుల ఎత్తున్న మూడు బండలపై 20 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తున్న ఈ రాతి ఆవాసంలో ఒకేసారి 20 మంది వరకూ నివసించే అవకాశముందన్నారు. బిఎస్ఆర్ హిల్స్ రోడ్డులో సహజసిద్ధమైన ట్రాఫిక్ ఐలాండ్లో ఉన్న, పురావస్తు ప్రాధాన్యత గల ఈ తాబేలు గుండును కాపాడి భవిష్యత్తరాలకు అందించాలని కాలనీవాసులకు ఈమని శివనాగిరెడ్డి, శ్రీ రామోజు హరగోపాల్ విజ్ఞప్తి చేశారు.

ANN TOP 10