ఖమ్మంలోని లకారం చెరువులో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మార్పులు చేస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయడంపై యాదవ సంఘాలు అభ్యంతరం చేయడంతోపాటు.. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించాయి. ఈ అంశంపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు(Telangana High Court).. విగ్రహావిష్కరణ అంశంపై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు విగ్రహావిష్కరణ చేపట్టవద్దని ఆదేశించింది. దీంతో నిర్వాహకులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి(NTR Statue) సంబంధించి నెమలి పింఛం, చేతిలోని పిల్లనగ్రోవిని తొలగిస్తున్నారు. ఇక పిల్లనిగ్రోవికి బదులుగా చేతిలో కత్తిని పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ రెండింటిని తొలగించి.. తాము కేవలం ఎన్టీఆర్ విగ్రహాన్ని మాత్రమే ఆవిష్కరిస్తున్నామని కోర్టుకు చెప్పేందుకు నిర్వాహకులు చెప్పబోతున్నట్టు తెలుస్తోంది.
కొంతకాలంగా వివాదానికి కేంద్రబిందువుగా మారిన ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్టు స్టే విధించింది. ఎన్టీఆర్ (NTR) శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని ఆయన శతజయంతి రోజున ఆవిష్కరించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ఈ విగ్రహ ఏర్పాటుకు సంకల్పించారు. అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహ ఆవిష్కరణ కోసం ఎన్టీఆర్ మనవడు, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను(Jr NTR) ఆహ్వానించారు. జూనియర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అంగీకరించారు. అయితే ఎన్టీఆర్ ను కృష్ణుడి రూపంలో విగ్రహంగా ఏర్పాటు చేయడంపై పలు కులసంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీనిపై హైకోర్టు ఆశ్రయించాయి. విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఈ విగ్రహావిష్కరణ చేపట్టకూడదని ఆదేశించింది.









