ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టాన్ని ఉపసంహరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం రూపొందించిన సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ కారణాలతో నిర్వీర్యం చేయడం బాధాకరమని ఆయన విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన జగన్, రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దిశ వ్యవస్థను తమ ప్రభుత్వం మహిళలు, చిన్నారులపై పెరుగుతున్న నేరాలను అరికట్టే లక్ష్యంతో తీసుకొచ్చిందని జగన్ పేర్కొన్నారు. నేరాల దర్యాప్తులో జాప్యం, న్యాయ ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారంగా ఈ వ్యవస్థను రూపొందించామని తెలిపారు. నేరాలను నిరోధించడం నుంచి, ఘటన జరిగిన వెంటనే స్పందించడం, బాధితులకు రక్షణ కల్పించడం వరకు సమగ్ర విధానాన్ని అమలు చేశామని వివరించారు.
అదేవిధంగా వేగవంతమైన దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, త్వరితగతిన చార్జిషీట్లు దాఖలు చేయడం, ప్రత్యేక కోర్టుల ద్వారా వేగంగా న్యాయం అందించే విధంగా దిశ వ్యవస్థను అభివృద్ధి చేశామని జగన్ తెలిపారు. మహిళల భద్రతకు సంబంధించిన ఇలాంటి కీలక వ్యవస్థను కొనసాగించడం ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.








