AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హగ్‌ చేసుకుని ఆపై గన్ తో కాల్చి చంపి.. అనంతరం ఆత్మహత్య

తోటి విద్యార్థిని అయిన స్నేహితురాలిని హగ్‌ చేసుకున్న ఒక విద్యార్థి ఆపై పిస్టల్‌తో కాల్పులు జరిపి ఆమెను హత్య చేశాడు. అనంతరం అతడు కూడా గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. శివ్ నాడార్ యూనివర్సిటీ క్యాంపస్‌లో బీఏ సోషియాలజీ మూడో ఏడాది చదువుతున్న 21 ఏళ్ల అనుజ్‌ సింగ్‌ గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు డైనింగ్‌ హాల్‌ బయట స్నేహితురాలైన స్నేహ చౌరాసియాను కలిశాడు.

అక్కడ వారిద్దరూ కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నారు. ఆ తర్వాత అనుజ్‌ ఒక గిఫ్ట్‌ ప్యాక్‌ను ఆమెకు ఇచ్చాడు. అయితే ఆ గిఫ్ట్‌ను తీసుకునేందుకు స్నేహ నిరాకరించింది. దీంతో ఉన్నట్టుండి అనుజ్‌ పిస్టల్‌ తీసి మొదట ఆమె కడుపుపై కాల్పులు జరిపాడు. ఈ నేపథ్యంలో అతడ్ని ప్రతిఘటించేందుకు ఆమె ప్రయత్నించింది. అయితే అనుజ్‌ మరోసారి కాల్పులు జరుపగా ఆమె కిందపడిపోయింది. ఆ తర్వాత అతడు బాయ్స్‌ హాస్టల్‌కు పరుగుతీశాడు.

తన రూమ్‌కు వెళ్లి గన్‌తో తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి ముందు ‘నా సూసైడ్‌ నోట్‌’ పేరుతో యూనివర్సిటీ గ్రూప్‌లో ఒక నోట్‌ను పోస్ట్‌ చేశాడు. కాగా, తీవ్రంగా గాయపడి రక్తం మడుగుల్లో పడి ఉన్న స్నేహాను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుజ్‌, స్నేహ మధ్య ఏడాదిన్నరగా స్నేహ సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే గత ఏడాది డిసెంబర్‌ నుంచి వారి మధ్య విభేదాలు రావడంతో తరచుగా గొడవ పడుతున్నట్లు తెలిసిందన్నారు. కాగా, డైనింగ్‌ హాల్‌ వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు.

ANN TOP 10