భారత మాజీ టెస్ట్ కెప్టెన్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోజే అతని కెరీర్‌లో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ స్టీవ్ వా నుంచి వచ్చిన ఫోన్ కాల్ రహానేకు కొత్త అవకాశాన్ని తీసుకొచ్చింది. ఆ ఆహ్వానం మేరకు యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL)లో ఆమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని ఆయన నిర్ణయించుకున్నారు.
రహానే వెల్లడించిన వివరాల ప్రకారం, తన రిటైర్మెంట్ ప్రకటించిన రోజే స్టీవ్ వా వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఆమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్‌లో చేరాలని ఆహ్వానించారు. ఆ ప్రతిపాదనపై ఒక రోజు ఆలోచించిన అనంతరం తాను అంగీకరించినట్లు చెప్పారు. ఈ అవకాశం తనకు ఎంతో ప్రత్యేకమని, కొత్త సవాల్‌గా స్వీకరించినట్లు పేర్కొన్నారు.
ఇది కేవలం మరో టీ20 లీగ్‌లో ఆడే అవకాశం మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా యువ క్రికెటర్లతో కలిసి తన అనుభవాన్ని పంచుకునే వేదికగా భావిస్తున్నట్లు రహానే తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా ఆటతో అనుబంధాన్ని కొనసాగిస్తూ కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్న ఆయనపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.








