హైదరాబాద్: అణచివేతకు గురవుతున్న వారికి అండగా ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లడుతూ… కర్నాటక ప్రజలు ఇచ్చిన తీర్పును చాలా మంది స్వాగతించారని పేర్కొన్నారు. ప్రధాని మోడీపై పోరాడతానని.. కర్నాటక కాంగ్రెస్ గెలుపు.. గెలుపు కాదని కెసిఆర్ అంటున్నారని తెలిపారు. కేసీఆర్ కుట్రల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు రేవంత్ సూచించారు. కాంగ్రెస్ త్యాగాలు చేసి తెలంగాణ ఇచ్చిందని లేకపోతే కేసీఆర్, కేటీఆర్ బతుకులు ఏం అయ్యేదో ఆలోచించుకోవాలన్నారు.
కర్నాటక ప్రజల తీర్పును ప్రపంచమంతా స్వాగతించిందన్నారు. మోడీకి ఎదురొడ్డి నిలస్తానని కెసిఆర్ చెప్పుకుంటూ వచ్చారు. మోడీని ఎదుర్కొవాలంటే కాంగ్రెస్ తో కలిసి పోరాడాలని మమత కోరుతున్నా విషయాన్ని ఆయన సూచించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కెసిఆర్ కుటుంబం బిచ్చమెత్తుకునేదని రేవంత్ పేర్కొన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు కెసిఆర్ కు కంటగింపుగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన వారందరూ మళ్లీ తిరిగి కాంగ్రెస్ గూటికే వస్తారంటూ రేవంత్ జోస్యం చెప్పారు.
ప్రధాని మోడీ బ్రాండ్ కు కాలం చెల్లిపోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మోడీని ఓడించవచ్చునని కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందని చెప్పారు. ప్రజల భద్రతను కేంద్రం గాలికి వదిలేసిందని, ప్రజలను పట్టించుకోకుండా కేంద్రమంత్రులు కర్ణాటకలో మోహరించారని రేవంత్ అన్నారు.
కర్ణాటకలో కులాలు , మతాల మధ్య చిచ్చు పెట్టి గెలవాలని బీజేపీ ప్లాన్ చేసిందని, అయితే బీజేపీ కుట్రలను కర్ణాటక ప్రజలు తిప్పికొట్టారన్నారు. కర్ణాటక ప్రజలు ఇచ్చిందని సరైన తీర్పుని వెల్లడించారు. దేశస్థాయిలో బీజేపీ స్థాయిని కాపాడేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. లక్ష కోట్లను కేసీఆర్ కర్ణాటకలో ఖర్చు చేసారని అన్నారు. మోడీ, కేసీఆర్ వేర్వేరు కాదని ఇద్దరు ఒక్కటేనని రేవంత్ చెప్పారు.









