దశాబ్ది ఉత్సవాల పేరుతో కేసీఆర్ (CM KCR) మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి బయలుదేరుతున్నారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ (Former MLA Ramulu Naik) మండిపడ్డారు. దశాబ్ది ఉత్సవాలని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… ఈ పది సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు చేశారన్నారు. కేసీఆర్ ఏం తీసుకొచ్చారని దశాబ్ది ఉత్సవాలు జరుపుతారని ప్రశ్నించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చావా?.. దళిత ముఖ్యమంత్రి ఇచ్చావా?.. నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చావా? అంటూ ఆయన నిలదీశారు.
కేసీఆర్ వచ్చాక అన్నింటిలో అవినీతే అని ఆరోపించారు. కర్ణాటకలో 40 శాతం కమిషన్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. తెలంగాణలో 500 శాతం అవినీతే అని… ఇక్కడి ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెపుతారని తెలిపారు. కేసీఆర్ గిరిజన యూనివర్సిటీని తీసుకురాలేకపోయారని, పోడు భూములకు పట్టాలివ్వలేదన్నారు. ప్రజలను డైవర్ట్ చేయడానికే దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని విమర్శించారు. గిరిజనులకు, మైనారిటీలకు రిజర్వేషన్లు పెంచినందుకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. కర్ణాటకలో మంత్రులు ఏవిధంగా ఓడిపోయారో.. ఇక్కడ కూడా అదేవిధంగా ఓడిపోతారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ వ్యాఖ్యలు చేశారు.









