ఒక్కరోజు పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు విచ్చేశారు. పర్యటనలో భాగంగా మొదటిగా గవర్నర్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాద్రి ఆలయ అర్చకులు రాష్ట్ర గవర్నర్ కు పూర్ణ కుంభoతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ అంత్రాలయంలో సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రధాన ఆలయం ఆవరణలో గల శ్రీలక్ష్మి తాయారు అమ్మవారి ఆలయంలో వేద పండితుల వేద ఆశీర్వచనం పలికి, స్వామి వారి జ్ఞాపిక, లడ్డు ప్రసాదం అందచేశారు.
దర్శనం అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలియజేశారు. ఇదిలా ఉండగాభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగాసికింద్రాబాద్ నుండి రైలు మార్గం ద్వారా కొత్తగూడెం చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు కలెక్టర్ అనుదీప్, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జి, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొత్తగూడెం నుండి రోడ్డు మార్గం ద్వారా గవర్నర్ బూర్గంపాడు మండలంలోని సారపాక గ్రామంలో ఉన్న పారిశ్రామిక సంస్థఐటిసి గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.









