ఆలస్యంగా పలుకరించనున్న వర్షాలు
ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు నాలుగు రోజులు ఆలస్యంగా భారత్‌ను పలుకరించనున్నాయి. జూన్ 4న ఈ పవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతం 83.5 సెం.మీ దాకా నమోదు కావొచ్చని తెలిపింది. ఎల్ నినో పరిస్థితులు ఏర్పడినప్పటికీ దేశమంతటా సాధారణ వర్షపాతం ఆశించవచ్చని చెప్పింది. సాధారణంగా ఏటా జూన్ 1న ఈ రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకాలి. అయితే గత అయిదేండ్లలో కేవలం నిరుడు మాత్రమే ఇలా జరిగింది. వ్యవసాయానికి కీలకమైన నైరుతి రుతు పవనాలు దేశంలో అత్యధిక భాగంలో వర్షాలకు కారణమవుతాయి.
ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం 67 శాతం ఉన్నదని ఐఎండీ వాతావరణశాఖ డైరెక్టర్ జనరల్ ఎం మహాపాత్ర వెల్లడించారు. భారత్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలాన్ని నైరుతి రుతుపవానాల కాలంగా పరిగణిస్తారు. భారత్‌లో ఈ ఏడాది లోటువర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ఏప్రిల్ 10న ప్రకటించింది. కరువు ఏర్పడేందుకు 20 శాతం అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఇందుకు కాస్త భిన్నంగా ఈ సారి వర్షాలు సాధారణ స్థాయిలో ఉంటాయని ఐఎండీ తెలిపింది.









