AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాష్ట్రం నిప్పుల కొలిమి

ఎండ ప్రచండమై బేజా రెత్తిస్తోంది.. సూర్య ప్రతాపానికి జనం అల్లాడి పోతున్నారు.. రోహిణి కార్తెకు మరో 8 రోజులుండగానే రోళ్లు పగులుతున్నాయి.. ‘ఇవేమి ఎండలు..?’ అని జనం ఇళ్లకే పరిమితమైపోతున్నారు… ఆరు రోజులుగా ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. బుధ, గురువారాల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చునని, ఎండల తీవ్రత దృష్ట్యా అత్యవసరమైతే తప్ప ఎవరూ బయట తిరగరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. వడగాడ్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ఇటీవల అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలుల వల్ల ఉష్ణోగ్రతలు పడిపోగా, వారం రోజులుగా సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వారం రోజులుగా గరిష్టంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇంత అధిక ఉష్ణోగత నమోదైన జిల్లాల్లో రాష్ట్రంలో ఇది రెండోది. మంగళవారం ములుగు జిల్లాలో అత్యధికంగా 43.8 డిగ్రీలు రికార్డయింది. మిగతా జిల్లాలైన జయశంకర్‌ భూపాలపల్లిలో 43.5 డిగ్రీలు, మహబూబాబాద్‌లో 43.3 డిగ్రీలు, వరంగల్‌లో 43.2 డిగ్రీలు, హనుమకొండలో 41.6 డిగ్రీలు, జనగామలో 42.6 డిగ్రీలు నమోదైంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆరు రోజులుగా ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు తగ్గడం లేదు. ఈనెల 11 నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. 11న 42.1 డిగ్రీలు, 12న 42 డిగ్రీలు, 13న 43 డిగ్రీలు, 14న 44 డిగ్రీలు, 15న 43.3 డిగ్రీలు, 16న 43.8. డిగ్రీలు నమోదైంది. రానున్న నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు 43.3 నుంచి 44.2 డిగ్రీలు దాటవచ్చునని వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, జయశంకర్‌ జిల్లాలో రేపు, ఎల్లుండి ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నది.

ANN TOP 10