కామారెడ్డి వీక్లీ మార్కెట్‌లో ఆదివారం అర్థరాత్రి దారుణం చోటుచేసుకుంది. అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేదని ఇంటికి నిప్పంటించాడు ఓ వ్యక్తి. మహేశ్వరి అనే మహిళతో నారాయణ అనే వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు. కొంతకాలం క్రితం మహేశ్వరికి నారాయణ రూ.6 వేలు అప్పుగా ఇచ్చాడు. కొద్దిరోజులుగా రూ.6 వేల అప్పు విషయంలో మహేశ్వరి, నారాయణ మధ్య తరుచుగా గొడవలు జరుగుతున్నాయి.
ఇటీవల మళ్లీ ఇద్దరి మధ్య అప్పు విషయంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహాంతో ఉన్న నారాయణ.. తాను ఇచ్చిన రూ. 6 వేల అప్పు ఎంత అడిగినా తిరిగి ఇవ్వకపోవడంతో మహేశ్వరి ఇంటికి నిప్పు అంటించాడు. మంటలు ఎగిసిపడటంతో స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. ఈ ఘటనలో ఆస్తి నష్టం జరగ్గా.. నిప్పంటించిన సమయంలో మహేశ్వరి ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
నారాయణ నిప్పంటించడాన్ని స్థానికులు గమనించారు. అక్కడే పట్టుకొని అందరూ కలిసి చితకబాదారు. ఈ ఘటనలో నారాయణకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో నిందితుడిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అప్పు తిరిగి ఇవ్వడం లేదనే కోపంతోనే నారాయణ ఇంటికి నిప్పు పెట్టినట్లు పోలీసులు తేల్చారు. అప్పు తిరిగి ఇవ్వలేదనే కారణంతో ఇంటికి నిప్పంటించిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.









