సినీనటి కరాటే కళ్యాణి ఆధ్వర్యంలో ఆందోళన
ఖమ్మంలో ఏర్పాటు చేయబోయే ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం నెలకొంది. శ్రీ కృష్ణుడు రూపంలో ఉన్న విగ్రహ ఏర్పాటుపై హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి..ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు వ్యతిరేకం కాదని.. అయితే కృష్ణుడు రూపంలో పెట్టడం సరికాదని అంటున్నారు. దీని వెనుక రాజకీయ ప్రయోజనం ఉందని..యాదవ, కమ్మ సామాజిక వర్గాల ఓట్లు కోసమే ఈ రూపంలో ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రారంభిస్తే ఊరుకోమని, దీన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు . మరోవైపు మే 28న నందముూరి తారకరామారావు వందో జయంతిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ఘనంగా వేడుకలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఖమ్మంలోనూ మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్న గారి ఖ్యాతిని ప్రతిబింబించేలా 54 అడుగులు విగ్రహాన్ని లకారం చెరువులో ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుండగా.. తానా సభ్యులు, కొందరు ఎన్నారైలు, పారిశ్రామిక వేత్తలు ఇందులో తమవంతు సాయం అందిస్తున్నారు. ఇందుకోసం సుమారు నాలుగు కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ విగ్రహం రూపు దిద్దుకుంటోంది. ఈ విగ్రహావిష్కరణలో ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొననున్నారు. ఓవైపు ఏర్పాట్లు వేగంగా జరుగుతుంటే.. మరోవైపు వివాదాలు చుట్టుముడుతున్నాయి. శ్రీ కృష్ణుడు రూపంలో ఉన్న విగ్రహం ఏర్పాటు పై హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.









