తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం రెండు రైళ్లు పరుగులు తీస్తున్నాయి. జనవరిలో సికింద్రాబాద్-విశాఖ మధ్య ఓ రైలు ప్రారంభం కాగా.. సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఏప్రిల్‌లో రైలు ప్రారంభమైంది. ఈ రెండు రైళ్లలో సికింద్రాబాద్- తిరుపతి (20701) మధ్య నడిచే వందేభారత్‌కు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
ఈ క్రమంలో కేంద్రం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రైలులో ప్రస్తుతం ఉన్న 8 కోచ్‌లను 16కి పెంచేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. ప్రయాణికుల రద్దీతో పాటూ తిరుమలకు వెళ్లే భక్తుల నుంచి ఆరణ వస్తోందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు లేఖ రాశారు. ఈ రైలుకు ఉన్న డిమాండ్‌ను వివరించడంతో వందేభారత్ రైలులో కోచ్‌ల సంఖ్య పెంచేందుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని బోగీలను రెట్టింపు చేసేందుకు కేంద్రం అంగీకరించింది.
‘యాత్రికులు, ప్రయాణికుల నుంచి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా సికింద్రాబాద్ – తిరుపతి మధ్యన తిరుగుతున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రస్తుతం ఉన్న 8 కోచ్ ల నుండి 16 కోచ్ లకు పెంచటానికి అంగీకరించిన PM నరేంద్ర మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కృతజ్ఞతలు’ తెలుపుతూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.









