ఇప్పటివరకు పోలింగ్ శాతం ఎంతంటే..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరుతున్నారు. క్యూలో నిలబడిన ఓటర్లు సాయంత్రం ఆరు గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఉదయం 9:30 గంటల సమయానికి 8:02 శాతంగా నమోదయ్యింది. ఈ మేరకు ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చింది.
ప్రధాని మోడీ కీలక ట్వీట్
కర్ణాటకలో పోలింగ్ జరుగుతుండగా ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లకు కీలక సందేశం ఇచ్చారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని కర్ణాటక ప్రజలను ఆయన కోరారు. ముఖ్యంగా యువత, తొలిసారి ఓటు వేసేవారు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
ఓటేసిన నారాయణమూర్తి దంపతులు..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఇన్పోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ‘‘దయచేసి మమ్మల్ని చూసి నేర్చుకోండి’’ అని సుధామూర్తి ఈ సందర్భంగా యువ ఓటర్లను కోరారు. ‘‘దయచేసి మమ్మల్ని చూడండి. మేము పెద్దవాళ్లం, కానీ మేం 6 గంటలకు లేచి ఇక్కడకు వచ్చి ఓటు వేశాం. దయచేసి మా నుంచి నేర్చుకోండి. ఓటు వేయడం ప్రజాస్వామ్యంలో పవిత్ర భాగం’’ అని సుధా మూర్తి అన్నారు.









