AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విమానంలో వింత.. మహిళకు తేలుకాటు

విమానంలో మహిళకు తేలు (Scorpion) కుట్టింది. అవును.. ఆశ్చర్యం కలిగించినా, మీరు విన్నది నిజమే. ఈ అరుదైన ఘటన ఎయిరిండియా (Air India) విమానంలో చోటు చేసుకుంది. విమానాల్లో వింత వింత ఘటనలు చోటు చేసుకుంటున్న వేళ.. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. నాగ్‌పుర్‌ నుంచి ముంబయి వెళుతున్న ఎయిరిండియా AI 630 విమానంలో ఏప్రిల్‌ 23న చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం గాల్లో ఉండగానే.. తనను తేలు కుట్టిందంటూ ఓ మహిళ ఫిర్యాదు చేశారు. విమానం ముంబయి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవగానే.. ఆ మహిళకు చికిత్స అందించారు. అంతకుముందే వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. ప్రయాణీకులంతా దిగిన తర్వాత విమానంలో క్షుణ్నంగా గాలించగా.. తేలు బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎయిరిండియా శనివారం (మే 6) ఓ ప్రకటనలో తెలిపింది. విమానం ల్యాండ్ అవగానే మహిళను వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స అందించామని, చికిత్స అనంతరం ఆమె డిచ్చార్జ్ అయ్యి, గమ్యస్థానానికి వెళ్లిపోయారని తెలిపింది.

‘ప్రయాణికులందరు దిగిన తర్వాత నిబంధనల ప్రకారం.. విమానంలో ఫ్యూమిగేషన్‌ (క్లీనింగ్‌) ప్రక్రియను చేపట్టాం. సిబ్బంది విమానంలో ఉన్న తేలును గుర్తించారు’ అని ఎయిరిండియా ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తనిఖీలు చేపట్టాలని, క్రిమికీటకాలు లేకుండా చూడాలని కేటరింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు సూచించినట్లు తెలిపింది. విమానంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. కిందటేడాది డిసెంబర్‌లో కోల్‌కతా నుంచి దుబాయ్‌ వెళుతున్న విమానం కార్గోలో పామును గుర్తించారు. అది కూడా ఎయిరిండియా విమానమే కావడం గమనార్హం.

ANN TOP 10