ఏపీ పదోతరగతి ఫలితాల్లో ఆరో తరగతి విద్యార్థిని సత్తా చాటింది. 488 మార్కులు సాధించి ఔరా అనిపించింది. అదేంటి ఆరో తరగతి విద్యార్థిని పది పరీక్షలు రాయటమేంటని ఆశ్చర్యపోతున్నారా ! అలా ఎలా అని ఆలోచిస్తున్నారా..? అవునండి.. మీరు విన్నది నిజమే ఆరో తరగతి విద్యార్థే పది పరీక్షలు రాసి 488 మార్కులు సాధించింది.
కాకినాడ జిల్లా గాంధీనగర్‌కు చెందిన ముప్పల సురేశ్, మణిల కుమార్తె హేమశ్రీ.. మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. హేమశ్రీ చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుకు. ఏం చదివినా.. ఇట్టే గుర్తుపెట్టుకుంది. ఆ చిన్నారి మెమురీ పవర్ అలాంటింది మరి. చిన్నారి టాలెంట్‌ను గుర్తించిన స్కూల్ యాజమాన్యం కొన్నాళ్ల క్రితం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఏడాది మార్చి 27న విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ హేమశ్రీ తెలివితేటల్ని పరీక్షించారు. ఆమె అసమాన ప్రతిభకు ఆయన సైతం ఆశ్చర్చపోయారు. చిన్నారి ప్రతిభను మెచ్చి టెన్త్ పరీక్షలు రాసేందుకు ప్రత్యేక అనుమతిని ఇచ్చారు. మే నెలలో పరీక్షలు రాసిన హేమశ్రీ సత్తా చాటింది. శనివారం ప్రకటించిన ఫలితాల్లో ఆమె 488 మార్కులు సాధించింది.
అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 2 నుంచి 10 వరకు నిర్వహించనునుండగా.. నేటి నుంచి ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పించారు. ఆన్సర్ షీట్ రీకౌటింగ్, రీవెరిఫికేషన్‌తో పాటు జవాబు పత్రాల జిరాక్స్ కాపీల కోసం ఈ నెల 13 లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రీకౌటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్‌తో పాటు జవాబు పత్రాల జిరాక్స్ కాపీలకు ఒక్కో సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున చెల్లించాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.









