AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆందోళనలతో అట్టుడుకుతున్న మణిపూర్..

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌‌ గిరిజనులు, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణలతో అట్టుడుకుతోంది. ప్రార్థనా స్థలాలు, వాహనాలకు నిరసనకారులు నిప్పంటించడంతో హింసను అదుపుచేయడానికి భారీగా బలగాలను మోహరించారు. ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. అవసరమైతే ‘కనిపిస్తే కాల్చివేత’కు ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. పలు జిల్లాల్లో సైనికులు కవాతు నిర్వహించారు. అల్లర్లను ఎదుర్కోవడంలో నైపుణ్యం ఉన్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్‌) బృందాలను కూడా కేంద్రం హుటాహుటిన తరలించింది.

తాజా పరిణామాలపై మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడారు. రాష్ట్రంలో పరిణామాలను కేంద్రం సునిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. మణిపుర్‌ పరిస్థితిపై అస్సాం, నాగాలాండ్‌, మిజోరం రాష్ట్రాల సీఎంలతోనూ ఆయన మాట్లాడారు. మైతై సామాజిక వర్గాన్ని ఎస్టీల జాబితాలో చేర్చాలన్న డిమాండ్లను వ్యతిరేకిస్తూ గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. రాజధాని ఇంఫాల్‌, చురచాంద్‌పుర్‌, కాంగ్‌పోక్పిలో ఘర్షణలు జరగడంతో ప్రభుత్వం మొబైల్‌ ఫోన్లలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది.

ఘర్షణ జరుగుతున్న ప్రాంతాల నుంచి ఇప్పటి వరకూ 9 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి సైనిక శిబిరాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో ఆశ్రయం కల్పించారు. చురచందాపూర్‌లో అత్యధికంగా 5,000 మంది నిరాశ్రయులయ్యారు. గత కొద్ది రోజులుగా ఇళ్లు, దుకాణాలకు మంటలు అంటుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రశాంతత కోసం అనేక విజ్ఞప్తులు వచ్చాయి.

ANN TOP 10