పొంగులేటితో బీజేపీ ఐదు గంటలపాటు జరిపిన మంత్రాంగం.. చివరకు ఏం తేల్చింది. జూపల్లి కూడా పొంగులేటి బాటలో నడుస్తున్నారా.. అసలు పొంగులేటి ఏ గట్టున ఉంటారు? బీజేపీ చేరికల కమిటీతో మీటింగ్ తర్వాత కూడా ఇంకా ఎందుకీ సస్పెన్స్? ఇంతకీ కమలనాథులు ఇచ్చిన హామీలేంటి? పొంగులేని పెట్టిన షరతులేంటి? .. అంతా సస్పెన్స్‌గా ఉంది.
ఖమ్మం జిల్లాలో బీజేపీ బలహీనంగా ఉంది. అందుకే పొంగులేటిని చేర్చుకునేందుకు కాంగ్రెస్ కంటే కాస్త ఎక్కువగానే ట్రై చేస్తోంది. ఈటల రాజేందర్ నేతృత్వంలోని చేరికల కమిటీ ఖమ్మం వెళ్లి.. పొంగులేటి నివాసంలో ఆయనతో సమావేశం అయింది. ఈ మీటింగ్‌లో జూపల్లి కృష్ణారావు కూడా పాల్గొన్నారు. ఇద్దరినీ పార్టీలో చేరాలని ఆహ్వానించారు ఈటల. పార్టీలో సముచిత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌ను ఓడించాలన్నదే అందరి ఉమ్మడి లక్ష్యమని.. అందుకే తమతో కలిసి పనిచేయాలని సూచించారు కమలనాథులు.
సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమని ప్రకటించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అనుచరులతో చర్చించాకే ఏ పార్టీలో చేరాలన్నది నిర్ణయిస్తామన్నారు. గతంలో కేసీఆర్‌ను గద్దె ఎక్కించేందుకు ఉద్యమం చేశామని.. ఇప్పుడు దింపేందుకు కూడా మరో ఉద్యమం చేయాలన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.









