ఎన్నికలు సమీపిస్తున్న వేళ గోషామహల్ నియోజవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు స్థానికంగా రాజకీయ వేడిని పెంచాయి. బీజేపీ నుంచి సస్పెండ్ చేసి ఆరు నెలలు దాటినా ఇప్పటికీ ఆ పార్టీ అధిష్ఠానం తనను పట్టించుకోకపోవడంతో పార్టీ మారే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన త్వరలో తనకు రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడితో చర్చ
రాజాసింగ్ 2009లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి 2009 నుంచి 2014 వరకు కార్పొరేటర్‌గా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరి 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్‌గౌడ్‌పై 46,793 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఓ వర్గంపై ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ అధిష్ఠానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సస్పెండై ఆరు నెలలు అవుతున్నా సస్పెన్షన్ ఎత్తివేతపై బీజేపీ అధినాయకత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయన తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను ఆయన రెండు రోజుల క్రితం వ్యక్తిగతంగా కలిసి చర్చలు జరిపినట్లు సమాచారం.









