కర్ణాటకలో మరోసారి అధికారం కోసం బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం బీజేపీ అగ్రనేతలు తరలిరానున్నారు. ప్రధాని మోదీ సైతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఈసీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయగా.. గురువారంతో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. ఇక రేపటి నుంచి కర్ణాటకలో హోరాహోరీ ప్రచారం సాగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
కర్ణాటక ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా తమ అభ్యర్థులను ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రకటించాయి. అయితే ఎన్నికల వేళ బీజేపీకి క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని మోదీతో పాటు జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షాతో పాటు మరికొంతమంది నాయకులు ప్రచారం చేయనున్నారు. మొత్తం వారం రోజుల పాటు కర్ణాటక ప్రచారంలో ప్రధాని పాల్గొననున్నారు.









