AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్రీకాకుళంలో టైటానియం ప్లాంట్‌.. సీఎం చంద్రబాబుతో కరణ్ అదానీ భేటీ..

ఏపీకి క్రమంగా భారీ పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా అదానీ గ్రూప్ రూ.16 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో టైటానియం ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తోంది. ఈ విషయమై సీఎం చంద్రబాబుతో వ్యాపారవేత్త కరణ్ అదానీ సమావేశమయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ రెడీ అయ్యింది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ ఎండీ కరణ్ అదానీ ఆధ్వర్యంలోని ఓ టీమ్, బుధవారం అమరావతిలో సీఎం చంద్రబాబుతో సమావేశమైంది. బీచ్‌శాండ్ ద్వారా లభించే ఇల్మనైట్ వంటి ఖనిజాలను ఉపయోగించి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయాలన్న ప్రణాళికను అదానీ గ్రూప్ ప్రతినిధులు వెల్లడించారు. ఇల్మనైట్‌ను ప్రాసెస్ చేయడం వల్ల టైటానియం స్లాగ్, టైటానియం డయాక్సైడ్, టైటానియం స్పాంజ్ లాంటివి ఉత్పత్తి చేయవచ్చని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

వాటిని పెయింట్స్, కాస్మెటిక్స్, ప్లాస్టిక్స్, యూవీ ప్రొటెక్షన్ ఉత్పత్తుల తయారీలో టైటానియం డయాక్సైడ్‌కు ఉన్న డిమాండ్‌ను వివరించారు. ముడి ఖనిజాల వెలికితీతకే పరిమితం కాకుండా రాష్ట్రంలో పూర్తిస్థాయిలో విలువ జోడింపు జరగాలని నొక్కి చెప్పారు సీఎం చంద్రబాబు. దీనివల్ల దిగుమతులు తగ్గి రాష్ట్ర-దేశ ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టులకు అవసరమైన వనరులు, సాంకేతికత, భాగస్వాములను గుర్తించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. అరుదైన భూఖనిజాల విషయంలో ఆంధ్రప్రదేశ్ స్వయం సమృద్ధి దిశగా పయనించాలన్నారు. అరుదైన ఖనిజాల రంగంలో తగిన సాంకేతిక భాగస్వాములను గుర్తించడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

ఇందుకుగాను శ్రీకాకుళం జిల్లాలో సుమారు రూ.16,000 కోట్లతో టైటానియం ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. టైటానియం ప్లాంట్‌తోపాటు రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ముందు ఉంచింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, అదానీ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ స్కూల్, విశాఖలో 1000 పడకల గల అదానీ ఆరోగ్య మందిర్ ఆసుపత్రి, 150 సీట్ల మెడికల్ కాలేజీ, అదానీ డేటా సెంటర్, ఐటీ పార్క్ ఏర్పాటుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ వివరాలను సీఎం చంద్రబాబుకు అందజేశారు.

ANN TOP 10