AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డయాలసిస్‌కు ఇక గుడ్‌బై..? ఇక నుండి కృత్రిమ కిడ్నీ..

కిడ్నీ సమస్య ఉన్నవారు డయాలసిస్‌ కోసం తప్పనిసరిగా ఆసుపత్రి చుట్టూ తిరగాల్సిందే. వారానికి రెండు, మూడు సార్లు డయాలసిస్‌ కేంద్రానికి వెళ్లాలి. గంటల తరబడి చికిత్స తీసుకోవాలి. సూదుల బాధను భరించాలి. రోజువారీ పనులకు కూడా అంతరాయం కలుగుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితిని మార్చే దిశగా ఓ కొత్త కృత్రిమ మూత్రపిండం ఆశలు రేపుతోంది. ‘హోల్లీ’ (Holly) పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ పరికరాన్ని శరీరంలోనే అమర్చవచ్చు. ఇది నిరంతరం రక్తాన్ని వడపోసి వ్యర్థాలను తొలగించేలా రూపొందిస్తున్నారు.

కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు 24 గంటలూ రక్తాన్ని శుద్ధి చేస్తుంటాయి. డయాలసిస్‌లో మాత్రం ఈ పని వారంలో కొన్ని గంటలు మాత్రమే జరుగుతుంది. ‘హోల్లీ’ కూడా సహజ కిడ్నీలా నిరంతరం పనిచేసేలా రూపొందిస్తున్నారు. శస్త్రచికిత్స ద్వారా దీన్ని శరీరంలో అమర్చి.. పెల్విస్‌ ప్రాంతంలోని రక్తనాళాలకు అనుసంధానిస్తారు. రక్తంలోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడం దీని ప్రధాన ఉద్దేశం.

ప్రస్తుతం డయాలసిస్‌ కోసం రోగులు తరచూ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది. కొత్త పరికరం అందుబాటులోకి వస్తే ఈ అవసరం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. పరికరం రోజంతా శరీరంలోనే పనిచేస్తుంది. నీటిని తొలగించే ప్రక్రియను అవసరానికి అనుగుణంగా ఉంటుందని దీని రూపకర్తలు చెబుతున్నారు. దీంతో పని, ప్రయాణం, ఇతర రోజువారీ పనులను కొనసాగించే అవకాశం కలగొచ్చు.

కిడ్నీ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఇది కొంతకాలం ఉపయోగపడే అవకాశముంది. అయితే ఇప్పుడే డయాలసిస్‌కు పూర్తిగా ప్రత్యామ్నాయం వచ్చేసిందని చెప్పలేం. ‘హోల్లీ’ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. మనుషులపై క్లినికల్‌ పరీక్షలు జరగాలి. ఇది సురక్షితమా? సమర్థంగా పనిచేస్తుందా? అన్నది తేలిన తర్వాతే తదుపరి నిర్ణయాలు ఉంటాయి.

భారత్‌లో కిడ్నీ వ్యాధుల భారం ఎక్కువగా ఉండటంతో ఈ పరిశోధనకు ప్రాధాన్యం పెరిగింది. ‘హోల్లీ’ తయారీని కొచ్చి, బెంగళూరు, ముంబయిలో చేపడుతున్నారు. క్లినికల్‌ పరీక్షలకు భారత్‌ను కూడా ఎంపిక చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే డయాలసిస్‌ కేంద్రాలపై ఆధారపడే రోగుల జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం ఉంది.

ANN TOP 10