AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాంచీలో అసెంబ్లీ ముట్టడికి యత్నం..! 600 మంది విద్యార్థులపై కేసులు నమోదు..

ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), ఝార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC) నిర్వహించిన పోటీ పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు జరిగాయంటూ ఆరోపిస్తూ రాంచీలో చేపట్టిన విద్యార్థుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున చేపట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారడంతో… పోలీసులు ఏకంగా 600 మంది ఆందోళనకారులపై కేసులు నమోదు చేశారు.

ఉద్రిక్తతకు దారితీసిన ఘటనలు:

జేపీఎస్సీ, జేఎస్‌ఎస్‌సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, వివాదాస్పద పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులు రాంచీలోని పాత అసెంబ్లీ భవనం నుంచి కొత్త అసెంబ్లీ భవనం వైపు మార్చ్ చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు విద్యార్థులు యత్నించడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను అడ్డుకోవడానికి పోలీసులు లాఠీఛార్జ్, వాటర్ క్యానన్లు, పదే పదే టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులతో పాటు భద్రతా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి.

ఈ క్రమంలో, అసెంబ్లీ వద్ద జరిగిన హింస, విధ్వంసం, శాంతిభద్రతల విఘాతంపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ముందస్తు అనుమతి లేకుండా ఆందోళన నిర్వహించడం, పోలీసులపై రాళ్లు రువ్వడం వంటి తీవ్ర ఆరోపణలతో 100 మంది కీలక నాయకులతో పాటు మరో 500 మంది విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ANN TOP 10