వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంపై.. వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసులో విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసింది. దీనిపై కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు అవినాష్ రెడ్డి. విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తున్నారంటూ అవినాష్ తరుపు లాయర్ కోర్టుకు తెలిపారు. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా అలాగే అరెస్ట్ చేశారని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం అవినాష్ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐకి ఆదేశాలిచ్చింది. అదేవిధంగా 25 వరకు ప్రతి రోజు అవినాష్ సీబీఐ విచారణకు రావాలని చెప్పింది. బెయిల్ పై తుది తీర్పు 25న ఉంటుందని స్పష్టం చేసింది.
దీనిని సవాల్ చేస్తూ సునీతా రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై వెంటనే విచారణ పూర్తి చేసి ఉత్తర్వులు జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అదే విధంగా ఈనెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చెయ్యవద్దన్న హైకోర్టు ఆదేశాలపై ఆమె పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు.









