టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ముందు నుంచి దూకుడుగా వ్యవహరిస్తున్న వైఎస్ షర్మిల.. తాజాగా ఇదే అంశంపై గవర్నర్ తమిళి సై కి లేఖ రాశారు. ఆర్టికల్ 317 ప్రకారం టీఎస్పీఎస్సీ బోర్డు రద్దుకు రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని, వెంటనే కొత్త బోర్డు ఏర్పాటు చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని ఏ కమిషన్ లో జరగని అతిపెద్ద స్కాం టీఎస్పీఎస్సీలో జరిగిందని.. సంతలో సరుకులు అమ్మినట్లుగా కీలకమైన పరీక్షా పేపర్లు అమ్ముకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. పేపర్ లీక్ ల వెనుక బోర్డు చైర్మన్, ఉద్యోగులతో పాటు రాష్ట్రమంత్రులు కూడా ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల ప్రోద్భలం లేకుండా ఇలాంటి స్కాం జరగడం అసాధ్యమని తెలిపారు.
పేపర్ లీక్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ‘సిట్’పై తమకు నమ్మకం లేదని..కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు కిందిస్థాయి ఉద్యోగులను బలి చేస్తున్నారని మండిపడ్డారు.పాత్రధారులను మాత్రమే దోషులుగా తేలుస్తూ.. సూత్రధారులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే పేపర్లు లీక్ చేశారని, ఇంకెవరి ప్రమేయం లేదని చెప్పి కేసును మూసివేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చర్యలకు వెనకాడిన పక్షంలో.. రాజ్యాంగం ప్రకారం నిర్ణయం తీసుకొనే బాధ్యత గవర్నర్ పై ఉంటుందని..తక్షణమే బోర్డు రద్దు చేసేలా చూడాలని విన్నవించుకున్నారు.కొత్త బోర్డు ఏర్పాటు చేసే దిశగా తోడ్పాటు అందించి, నిరుద్యోగులకు న్యాయం చేస్తారని భావిస్తున్నాని తెలిపారు.









