వేసవి వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లేందుకే జనాలు జంకుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు రాని పరిస్థితి. ఎండకు తోడు వడగాల్పుల తీవ్రత పెరగడంతో రోడ్లపై జన సంచారం కూడా కాస్త తగ్గింది. అయితే తెలంగాణలో భానుడి ప్రతాపంతో బీర్ల అమ్మకాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు మందుబాబులు బీర్లతో చిల్ అవుతున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే ఏప్రిల్ 1 నుంచి 17వ తేదీ వరకు దాదాపు 1.01 కోట్ల వరకు బీర్లు అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్‌శాఖ గణంకాలు చెబుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో కిలిపి 8,46,175 కేసుల బీర్లు విక్రయించారు. ఒక కేసులో 12 బీర్లు ఉంటాయి కాబట్టి భారీ స్థాయిలో బీర్లు అమ్ముడయ్యాయి.
ఈ నెలలో ఇప్పటిదాక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి ప్రతిరోజు 6 లక్షల బీర్లు అమ్ముడయ్యాయి. ఎండలు మొదలు కావడంతో మార్చి నెల నుంచే బీర్ల అమ్మకాల్లో భారీగా పెరిగాయి. ఏప్రిల్‌లో ఈ నెల 17వ తేదీ వరకు హైదరాబాద్‌లో 1,94,351 కేస్‌లు, రంగారెడ్డి జిల్లాలో 5,59,5746 కేస్‌ల బీర్లు, మేడ్చల్ జిల్లాలో 92,078 కేస్‌ల బీర్లను విక్రయించారు. ఇక మార్చిలో హైదరాబాద్ జిల్లా పరిధిలో 3,68,569 కేస్‌లు, రంగారెడ్డి జిల్లా పరిధిలో 10,77,240 కేస్‌లు, మేడ్చల్ జిల్లా పరిధిలో 1,63,358 కేస్‌ల బీర్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఒక్క హైదరాాబాద్ పరిధిలోనే ఇన్ని అమ్ముడయ్యాయంటే ఇక మిగతా జిల్లాలో కూడా బీర్ల అమ్మకాలు బాగానే పెరిగే అవకాశం ఉంది. అయితే రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండటంతో బీర్ల విక్రయాలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. అలాగే డిమాండ్‌కు తగ్గట్లు వైన్ షాపులకు బీర్లు సరఫరా చేస్తోంది.









