కరోనా భయపెడుతోంది. రోజువారీ కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో కరోనా వైరస్ మళ్లీ కలవరపాటుకు గురి చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలోనూ కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో కరోనా కట్టడికి ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు బూస్టర్ డోసులు అందించాలని నిర్ణయించింది. ఉచితంగా వీటిని అందించనుంది. ‘కార్బో వ్యాక్సిన్’ను బూస్టర్ డోసుగా ఇవ్వనుంది. ఈ మేరకు ఇప్పటికే 5 లక్షల డోసులను సిద్ధంగా ఉంచినట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. మొదటి, రెండో డోసు కొవాగ్జిన్, కొవిషీల్డ్ తీసుకున్నవారు కూడా బూస్టర్ డోసుగా కార్బోవ్యాక్సిన్ తీసుకోవచ్చని, ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.
కార్బోవ్యాక్సిన్‌కు అధికారికంగా అనుమతులు కూడా వచ్చాయి. దీంతో ఈ వ్యాక్సిన్‌ను ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్లలో అందుబాటులోకి తెచ్చినట్లు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా బూస్టర్ డోస్‌లను తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలలో బుధవారం నుంచి బూస్ట్ డోస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు అందరూ రెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో బూస్టర్ డోస్ పంపిణీ చేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.









