తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. నేడు, రేపు పలు జిల్లాలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. బుధవారం ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణశాఖ మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఇక గురువారం కామారెడ్డి, ములుగు, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. అలాగే 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.









