కరీంనగర్‌లో సంచలనం సృష్టించిన PMJ జ్యువెలరీ భారీ దోపిడీ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సినిమా క్లైమాక్స్‌ను తలపించేలా సాగిన ఈ ఆపరేషన్ వివరాలను కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు.
జైలు నుంచే ఆపరేషన్.. సుబోధ్ సింగ్ ‘మెగా’ మాస్టర్ ప్లాన్!
ఈ భారీ దోపిడీ వెనుక ఉన్న అసలు సూత్రధారి బీహార్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుబోధ్ సింగ్. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం జైలులో ఉన్న సుబోధ్, అక్కడి నుంచే తన నెట్‌వర్క్‌ను అత్యంత చాకచక్యంగా నడిపిస్తున్నాడు. ఆరు రాష్ట్రాల్లో విస్తరించిన ఈ గ్యాంగ్ సభ్యులకు సుబోధ్ స్వయంగా జీతాలు ఇస్తూ ఒక కార్పొరేట్ తరహాలో ముఠాను పోషిస్తున్నాడు. ఎక్కడ దోపిడీ చేయాలి, ఎవరిని టార్గెట్ చేయాలి అనేది జైలు నుంచే నిర్ణయించి, రఘునాథ్ కర్మాకర్ లీడ్‌లో ఈ ఆపరేషన్‌కు స్కెచ్ వేశాడు.
మూడు టీమ్‌లు.. పక్కా స్కెచ్..
ఈ ముఠా పనితీరు అత్యంత వృత్తిపరంగా ఉంటుంది. వీరు మొత్తం మూడు బృందాలుగా విడిపోయి పనిచేస్తారు. మొదటి టీమ్ నేరుగా దోపిడీ చేస్తే, రెండో టీమ్ ఆ సొత్తును అందుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. మూడో టీమ్ ఆ ఆభరణాలను నేపాల్ వంటి ప్రాంతాల్లో విక్రయించి నగదుగా మారుస్తుంది. ఈ దోపిడీ కోసం నిందితులకు నకిలీ ఆధార్ కార్డులు, దొంగ పేర్లతో కూడిన గుర్తింపు కార్డులను ముందే సిద్ధం చేశారు. దోపిడీకి ఒకరోజు ముందే చంద్రపూర్‌లో మరో ముఠా ద్వారా వీరికి 6 పిస్టల్స్, 12 మ్యాగజైన్లను అందజేయడం వీరి నెట్‌వర్క్ బలాన్ని సూచిస్తోంది.
కరీంనగర్‌లో కాల్పుల కలకలం.. రూ. 82 లక్షల సొత్తు మాయం
పెద్దపల్లి, సిద్దిపేట, ఖమ్మం వంటి నగరాల్లో రెక్కి నిర్వహించిన అనంతరం ఈ ముఠా కరీంనగర్‌ను ఎంచుకుంది. దోపిడీ సమయంలో ఐదుగురు సభ్యులు షోరూమ్‌లోకి ప్రవేశించగా, అందులో నలుగురు కాల్పులు జరిపి భయాందోళన సృష్టించారు. నిందితులు 1.650 కేజీల బంగారం (161.4 తులాలు), 112 క్యారెట్ల వజ్రాభరణాలను దోచుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ. 82,02,000. దోపిడీ అనంతరం నిందితులు తొలుత బైక్‌లపై పారిపోయి, ఆ తర్వాత పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు వాటిని వదిలేసి రైళ్లలో పరారయ్యారు.
ముగ్గురు అరెస్ట్.. 13 మంది నిందితుల గుర్తింపు!
సీపీ గౌస్ ఆలం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ముగ్గురు కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో రఘునాథ్ కర్మాకర్, రావిష్ కుమార్, మెహతాబ్ ఖాన్ ఉన్నారు. వీరిలో ఇద్దరు నేరుగా దోపిడీలో పాల్గొనగా, ఒకరు వారికి కావాల్సిన సహకారాన్ని అందించారు. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులను గుర్తించామని, పరారీలో ఉన్న మిగిలిన వారికోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని సీపీ వెల్లడించారు. నిందితుల నుంచి సమాచారాన్ని సేకరిస్తూ ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
తెలంగాణలో ‘గోల్డెన్ థీఫ్’ గ్యాంగ్ తొలి అడుగు!
దేశవ్యాప్తంగా సుమారు 42 నుంచి 45 వరకు కేసులు ఉన్న ఈ గ్యాంగ్, తెలంగాణలో చోరీకి పాల్పడటం ఇదే మొదటిసారి. బీహార్, బెంగాల్ రాష్ట్రాలకు చెందిన ఈ ముఠా సభ్యులు పక్కా వ్యూహంతో రాష్ట్రంలోకి ప్రవేశించారు. దోపిడీకి ఒక టీమ్ పాల్గొంటే, మరో టీమ్ ఆభరణాలను చేరవేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ నెట్‌వర్క్ మూలాలను వెలికితీస్తూ, దోచుకున్న సొత్తును పూర్తిగా స్వాధీనం చేసుకునే దిశగా చర్యలు వేగవంతం చేశారు. ఈ అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా జ్యువెలరీ యజమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.









