రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేసేందుకు, కంప్యూటర్ ల్యాబ్‌ల వినియోగాన్ని పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,288 ప్రభుత్వ పాఠశాలల్లో సర్వీస్ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 1,644 మంది ఐసీటీ(ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీచేశారు.
1,700 స్కూళ్ల కోసం..
మొత్తం ఇన్‌స్ట్రక్టర్లలో సమగ్ర శిక్ష పరిధిలో 1,700 స్కూళ్ల కోసం 850 మందిని, అలాగే పీఎం శ్రీ పరిధిలో 1588 పాఠశాలలకు 794 మందిని కేటాయించారు. అంటే ప్రతి రెండు స్కూళ్లకు ఒక ఇన్‌స్ట్రక్టర్ ను నియమించనున్నారు. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఎంపిక చేసిన మూడు ప్రైవేట్ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ఈ నియామకాలు జరగనున్నాయి. పాఠశాలల్లో అందుబాటులో ఉన్న స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లను విద్యార్థులు, ఉపాధ్యాయులు సమర్థవంతంగా వినియోగించుకునేలా ఈ ఇన్‌స్ట్రక్టర్లు విధులు నిర్వర్తిస్తారు.
తక్కువ దూరంలో..
ఈ కార్యక్రమం సజావుగా సాగడానికి తక్షణమే స్కూల్ మ్యాపింగ్ ప్రక్రియను ప్రారంభించాలని జిల్లా విద్యాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మ్యాపింగ్ ప్రకారం ఒక్కో ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్‌కు గరిష్టంగా రెండు పాఠశాలలను మాత్రమే కేటాయించాల్సి ఉంటుంది. ఇన్‌స్ట్రక్టర్లకు ప్రయాణ ఇబ్బందులు లేకుండా, జత చేసే రెండు పాఠశాలలు వీలైనంత వరకు ఒకే మండల పరిధిలో, అత్యంత తక్కువ దూరంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏజెన్సీలు సమర్పించే మ్యాపింగ్ ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించి, స్కూల్ పేరు, యూడైస్ కోడ్ తదితర వివరాలను క్షుణ్ణంగా వెరిఫై చేసిన తర్వాతే ధృవీకరించాలని డీఈవోలను ఆదేశించారు. నియామకాలు, అభ్యర్థుల శిక్షణ, విధుల్లో చేరే ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, ఇందులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని విద్యాశాఖ హెచ్చరించింది.








