విద్యుత్ సంస్థల్లో ఆస్తుల విభజనకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేస్తున్న తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆస్తుల విభజనపై దృష్టిసారిస్తోంది. కేవలం రెండు నెలల వ్యవధిలో ఎంసీఏ ఆమోదం పొందడం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) పూర్తి చేయడం, కీలకంగా భావించే ఉద్యోగుల విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. క్షేత్ర స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించడానికి కీలకమైన ఆస్తుల విభజనలో భాగంగా మొదటిగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల సర్వే పై దృష్టిపెట్టింది.
సర్వే కోసం రైతు డిస్కం యాప్..
రాష్ట్రవ్యాప్తంగా 5.60 లక్షల వ్యవసాయ ట్రాన్సఫార్మర్లు ఉండగా.. సెక్షన్ కు మూడు టీంల చొప్పున, 744 ఆపరేషన్ సెక్షన్లలో 2,232 బృందాలు ప్రతిరోజు ఈ సర్వే లో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించారు. సర్వే కోసం రైతు డిస్కం ప్రత్యేక యాప్ రూపొందించింది. ఈ యాప్ ద్వారా అసిస్టెంట్ ఇంజినీర్లు తమ పరిధిలోని వ్యవసాయ డీటీఆర్‌లకు సంబంధించిన స్ట్రక్చర్, డీటీఆర్ ఎంబోస్ నంబర్, నేమ్‌ప్లేట్ వివరాలను ఫోటోల రూపంలో సేకరించి, ఆయా ట్రాన్స్‌ఫార్మర్ల జియో కోఆర్డినేట్లను నమోదు చేయనున్నారు.
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో..
ఇదిలా ఉండగా..ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ డిస్కంల సీఎండీలు, సీనియర్ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు డిస్కం పరిధిలోకి తీసుకురానున్న వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల సర్వేపై విస్తృతంగా చర్చించారు. ఇప్పటికే రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో పైలట్ ప్రాతిపదికన కొన్ని వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల సర్వే విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈనెల 28వ తేదీన విద్యుత్ నియంత్రణ కమిషన్(ఈఆర్సీ) రైతు డిస్కంకు లైసెన్స్ మంజూరు అంశంపై బహిరంగ విచారణ నిర్వహించనున్నట్లు తెలిపారు.
జూన్ 2వ తేదీ నుంచి..
అలాగే అసెట్ మ్యాపింగ్ ప్రక్రియ కూడా పూర్తయితే, ప్రభుత్వ నిర్ణయానుసారం జూన్ 2వ తేదీ నుంచి రైతు డిస్కం పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని రైతు డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ జితేశ్ వీ పాటిల్, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు నరసింహులు, మోహన్ రావు, మధుసూదన్, శివాజీ, కృష్ణారెడ్డి, తిరుపతి రెడ్డి, ఆర్పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్లు ఏ కామేశ్, శ్రవణ్ కుమార్, ఇతర చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లు పాల్గొన్నారు.









