AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

20 ఏళ్ల నిరీక్షణ..! నిన్న పోస్టింగ్, నేడు రిటైర్మెంట్..! సోషల్ మీడియాలో వైరల్..

ఒక్క రోజు.. కేవలం ఒక్కటంటే ఒక్క రోజు ముందు ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎలా ఉంటుంది? జీవితకాల స్వప్నం నెరవేరిందన్న సంతోషం తీరకముందే, మరుసటి రోజే రిటైర్మెంట్ బోర్డు కనిపిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. కానీ, ఝార్ఖండ్ విద్యాశాఖ పుణ్యమా అని ఇలాంటి విచిత్రమైన, కాస్త బాధాకరమైన సంఘటనలు నిజంగానే జరిగాయి. పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం కోసం దశాబ్దాలుగా ఎదురుచూసిన ఇద్దరు ఉపాధ్యాయుల జీవితాల్లో అక్కడి ప్రభుత్వ లేరాని తనం ఆడుకున్న వింత నాటకం ఇది.

 

20 ఏళ్ల నిరీక్షణ.. ఒక్క రోజు ముచ్చట!

అయితే ఝార్ఖండ్‌కు చెందిన నందలాల్ అనే వ్యక్తి 2006 నుంచి పారా టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, పర్మనెంట్ స్టేటస్ కల్పించాలని పారా టీచర్లు ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2023లో అసిస్టెంట్ టీచర్ల నియామకం కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. ఎలాగైనా పర్మనెంట్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో నందలాల్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఆయనకు ప్రభుత్వ నియామక పత్రం (Joint Letter) అందింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఏంటంటే.. ఆయనకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చిన మరుసటి రోజే ఆయన రిటైర్మెంట్ వయసు (60 ఏళ్లు) నిండిపోవడంతో ఉద్యోగ విరమణ చేయాల్సి వచ్చింది. అంటే, కేవలం ఒక్క రోజు పర్మనెంట్ ఉద్యోగిగా ఉండి ఆయన రిటైర్ అయిపోయారు.

 

రిటైర్మెంట్ అయిపోయాక.. ఆర్డర్ కాపీ చేతికి

నందలాల్ కథ ఇలా ఉంటే.. నయీమ్ అనే మరో ఉపాధ్యాయుడి పరిస్థితి మరీ విచిత్రంగా మారింది. నయీమ్‌కు కూడా అసిస్టెంట్ టీచర్‌గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. కానీ, ఆయనకు పోస్టింగ్ ఆర్డర్ చేతికి వచ్చేసరికే ఆయన రిటైర్మెంట్ వయసు దాటి నెల రోజులు దాటిపోయింది. అంటే, ఉద్యోగ విరమణ వయసు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఆయనకు “మీకు ఉద్యోగం వచ్చింది.. విధుల్లో చేరండి” అంటూ ఆర్డర్ కాపీ పంపింది. ఒకవైపు పర్మనెంట్ ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఉన్నా.. సాంకేతికంగా విధుల్లో చేరలేని పరిస్థితిని చూసి సదరు ఉపాధ్యాయుడు తలపట్టుకున్నారు.

 

ప్రభుత్వ ఆలస్యం.. ఉద్యోగుల శాపం!

ఈ విచిత్ర పరిస్థితులకు ప్రభుత్వ యంత్రాంగం యొక్క మందకొడితనమే ప్రధాన కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2023లో ప్రారంభమైన నియామక ప్రక్రియను పూర్తి చేయడానికి విద్యాశాఖకు మూడేళ్ల సమయం పట్టింది. ఈ సుదీర్ఘ ఆలస్యం వల్ల ఎందరో అర్హులైన అభ్యర్థుల వయోపరిమితి ముగిసిపోయింది. ఏళ్ల తరబడి చాలీచాలని జీతాలతో పారా టీచర్లుగా పనిచేసి, రిటైర్ అయ్యే వయసులో పర్మనెంట్ ఉద్యోగ పత్రాలు అందుకోవడం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త వైరల్ అవ్వడంతో పాటు.. “ఇదేందయ్యా ఇది.. ఇలాంటి నియామకాలు ఎక్కడైనా ఉంటాయా?” అంటూ నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ANN TOP 10