సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు రోజుల క్రితం జరిగిన బీటెక్ విద్యార్థి యావన్ (23) దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులైన యువతి బావ.. సోదరుడితో పాటు మొత్తం పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జవహర్‌నగర్ ప్రాంతానికి చెందిన యావన్ సీతాఫల్‌మండిలో ఒక యువతిని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ వ్యవహారం నచ్చని యువతి బంధువులే పథకం ప్రకారం అతడిని అంతం చేసినట్లు విచారణలో తేలింది. సికింద్రాబాద్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన ‘ప్రీ ప్లాన్డ్ మర్డర్’.
జవహర్‌నగర్ ప్రాంతానికి చెందిన యావన్, చంద్రికలు పాఠశాల స్థాయి నుండి స్నేహితులు. గత రెండేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారు. అయితే వీరి ప్రేమను యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలోనే యావన్‌ను పలుమార్లు హెచ్చరించారు. మరోవైపు యువతి బావ, చిలకలగూడ పోలీస్ స్టేషన్ రౌడీ షీటర్ అయిన అల్లబోయిన సాయి కిరణ్ ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని భావించాడు. తమ ప్రేమకు అడ్డుగా ఉన్న యావన్‌ను తొలగించుకోవాలని సాయి కిరణ్ ఐదు రోజుల ముందే హత్యకు స్కెచ్ వేశాడు.
మే 7 అర్ధరాత్రి సమయంలో నిందితులు మూడు ద్విచక్ర వాహనాలపై యావన్ ఉంటున్న సీతాఫల్‌మండిలోని అతని స్నేహితుడి ఇంటికి చేరుకున్నారు. నిందితులు ఒక్కసారిగా లోపలికి చొరబడి కత్తులతో దాడి చేయగా.. ప్రాణభయంతో యావన్ బయటకు పరిగెత్తాడు. అయినా వదలకుండా నడిరోడ్డుపై వెంబడించి అత్యంత క్రూరంగా 17 చోట్ల కత్తులతో పొడిచి కిరాతకంగా చంపేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిలో ఇద్దరు నిందితులు (శ్రీగిరి రాహుల్, శివ నందన్ యాదవ్) గంజాయి సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలింది.
ఘటనపై ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ప్రధాన నిందితుడు సాయి కిరణ్ (A1), యువతి తండ్రి నర్సింహ యాదవ్, బాబాయ్‌లు, సోదరుడు సహా పది మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి హత్యకు వాడిన కత్తి, మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మాజీ కార్పొరేటర్ సామల హేమ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులపై గతంలోనే అనేక కేసులు ఉన్నాయని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా దోషులకు ఉరిశిక్ష వేయాలని కోరుతోంది.







