దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న జర్నలిస్టులకు తీపి కబురు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సోమవారం జర్నలిస్టులతో జరిగిన ప్రత్యేక చిట్‌చాట్‌లో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. జర్నలిస్టుల చిరకాల స్వప్నమైన ఇళ్ల స్థలాల అంశంపై ఈ నెల 21వ తేదీన నిర్వహించబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం వివరించారు. భవిష్యత్తులో ఎటువంటి న్యాయపరమైన అడ్డంకులు ఎదురుకాకుండా పకడ్బందీగా చట్టబద్ధత కల్పించేందుకే కేబినెట్ ఆమోదం పొందుతామని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న రెవెన్యూ రిసోర్స్ మొబలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ ఈ అంశంపై లోతుగా కసరత్తు చేస్తోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. శ్రీధర్ బాబు.. జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ క్షేత్రస్థాయిలోని సాధకబాధకాలను పరిశీలిస్తోంది. ఈ సబ్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కేబినెట్ తన ఆమోద ముద్ర వేయనుంది. ప్రభుత్వం కేవలం స్థలాలు కేటాయించడమే కాకుండా.. అక్కడ లే అవుట్ల నిర్మాణం.. రోడ్లు.. విద్యుత్.. మంచినీటి వసతి వంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించనుంది. ఈ మౌలిక వసతుల కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించడం ద్వారా జర్నలిస్టులపై ఆర్థిక భారం పడకుండా చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
జర్నలిస్టుల సంక్షేమం పట్ల తమ ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో ఉందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. సోమవారం మూడు జర్నలిస్టు హౌసింగ్ సొసైటీల ప్రతినిధులతో కూడిన జేఏసీ సభ్యులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి తమ తీర్మానాలను అందజేశారు. మరికొద్ది రోజుల్లో జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (JNJ) సభ్యులు కూడా తమ సంతకాల కాపీలను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. గత 18 ఏళ్లుగా తమ సొంత ఇంటి కల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది జర్నలిస్టుల ఆశలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా చొరవ తీసుకుని జూన్ 2వ తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించడంతో జర్నలిస్ట్ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
కేబినెట్ సబ్ కమిటీ తన నివేదికను సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే 21వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో అధికారిక ఉత్తర్వులకు మార్గం సుగమం కానుంది. ఇళ్ల స్థలాల పంపిణీలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మేలు జరిగేలా నిబంధనలను రూపొందిస్తున్నారు. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం జర్నలిస్టుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు జూన్ 2న ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియకు సంబంధించి స్పష్టమైన ప్రకటన వెలువడనుంది







