AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా..? పార్టీ నుండి దూరం కాబోతుందా..?

వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల తన రాజకీయ ప్రస్థానంపై వస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. తనను పార్టీ నుంచి దూరం చేయాలని చూస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందని చీకట్లో చప్పుడు చేస్తున్న వారికి తన గళమే సమాధానమని స్పష్టం చేశారు. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని.. ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన తనకు ప్రజల ప్రేమ ఉన్నంత వరకు ఎవరూ అడ్డుకట్ట వేయలేరని ధీమా వ్యక్తం చేశారు.

 

తన రాజకీయ ప్రయాణం ఎవరి కరుణతోనూ మొదలుకాలేదని శ్యామల గుర్తు చేశారు. తన స్వరం, నిబద్ధత, జగనన్న పక్షాన నిలబడే ధైర్యం మాత్రమే తనను ఈ స్థాయికి చేర్చాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ తనపై ఉంచిన నమ్మకమే తన అసలైన బలమని వెల్లడించారు. తాడేపల్లిలో ఏదో జరుగుతోందని.. పొగ కనిపిస్తోందని కథలు రాసేవారు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. అక్కడ కనిపిస్తున్నది పొగ కాదని.. శ్యామల ఎదుగుదల చూసి కొందరిలో మొదలైన కడుపుమంట అని ఎద్దేవా చేశారు.

 

తప్పుడు పుకార్లతో గానీ.. కుట్రలతో గానీ తనను పార్టీకి దూరం చేయడం ఎవరి తరము కాదని శ్యామల తేల్చి చెప్పారు. ప్రతిరోజూ తనపై తప్పుడు కథనాలు రాసేవారు ఉన్నప్పటికీ.. తాను మాత్రం జగన్ ఆశయాల సాధన కోసం అడుగులు వేస్తూనే ఉంటానని ప్రకటించారు. తనను సైలెంట్ చేయాలని చూసే ప్రతి ప్రయత్నం తన గళాన్ని మరింత గట్టిగా మారుస్తుందని హెచ్చరించారు. ఇది తన కౌంట్‌డౌన్ కాదని.. తన పోరాటానికి.. తన గళానికి మరింత బలంగా మొదలయ్యే స్టార్ట్ అని స్పష్టం చేశారు.

 

నన్ను తగ్గించాలని చూసే వారు చాలామంది ఉండవచ్చు కానీ.. నన్ను నిలబెట్టేది జగన్ అన్న నమ్మకం అలాగే కోట్లాది ప్రజల ప్రేమ అని శ్యామల భావోద్వేగంగా మాట్లాడారు. రాజకీయాల్లో విమర్శలు సహజమని.. అయితే వ్యక్తిత్వ హననానికి పాల్పడితే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. జగనన్న సైనికురాలిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం.. పార్టీ బలోపేతం కోసం తన గళం నిరంతరం వినబడుతూనే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు.

ANN TOP 10