AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో షీటీమ్స్ నిఘా: ఆకతాయిలకు చెక్ పెట్టేందుకు మఫ్టీలో పోలీసుల మాటు!

ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల కోసం హైదరాబాద్ నగరవ్యాప్తంగా 15 ప్రత్యేక షీటీమ్స్ బృందాలు రంగంలోకి దిగాయి. గతంలో కంటే భిన్నంగా ఈసారి మఫ్టీలో, సాధారణ యువతుల్లా ఈ బృందాలు పబ్‌లు, ఈవెంట్ జరిగే ప్రాంతాలు మరియు హోటళ్లలో మాటు వేయనున్నాయి. పబ్లిక్ ప్లేసులతో పాటు నిర్మానుష్య ప్రాంతాలు, చీకటి ప్రదేశాలలో కూడా నిఘా పెంచారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ వంటి రద్దీ ప్రాంతాల్లో ఆకతాయిలు వేధింపులకు పాల్పడితే వెనువెంటనే అదుపులోకి తీసుకునేలా వ్యూహరచన చేశారు.

వేడుకలకు హాజరయ్యే మహిళల భద్రత కోసం షీటీమ్స్ పలు కీలక సూచనలు చేశాయి. రాత్రి వేళ పార్టీలకు వెళ్లేటప్పుడు ఒంటరిగా కాకుండా నమ్మకమైన స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాలని కోరారు. ముఖ్యంగా పార్టీలలో అపరిచిత వ్యక్తులు ఇచ్చే పానీయాలను స్వీకరించవద్దని, వాష్‌రూమ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత సగం వదిలేసిన డ్రింక్స్‌ను మళ్లీ తీసుకోవద్దని హెచ్చరించారు. డ్రింక్స్‌లో మత్తు మందు కలిపే అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నగరంలోని నాలుగు కమిషనరేట్ల పరిధిలో నిఘా కెమెరాల ద్వారా కూడా ఆకతాయిల కదలికలను గమనిస్తున్నారు. ఎవరైనా ఇబ్బందులకు గురైతే లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణమే డైల్ 100కు కాల్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని అధికారులు వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని, ఎక్కడా మహిళల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ఉండటమే తమ లక్ష్యమని షీటీమ్స్ స్పష్టం చేశాయి.

ANN TOP 10