AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్ పోలీస్ ‘జీరో టాలరెన్స్’: తాగి స్టీరింగ్ పట్టుకుంటే సీన్ రివర్స్!

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సీపీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా వినూత్నంగా మరియు వ్యంగ్యంగా హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా అర్ధరాత్రి వేళ పోలీసులతో వాగ్వాదానికి దిగి, లేనిపోని సెక్షన్లు వల్లించే ‘అతి తెలివి’ మేధావులను ఆయన టార్గెట్ చేశారు. “భారతీయ చట్టాల్లో సెక్షన్ 123, 567 వంటివి లేవు. ఒకవేళ మీరు అవే ఉన్నాయని వాదిస్తే, మీరు స్టాండప్ కామెడీకో లేదా ఫిక్షన్ రైటింగ్‌కో పనికొస్తారు” అంటూ ఎద్దేవా చేశారు. మద్యం మత్తులో ఊహజనిత చట్టాలు చెప్పి పోలీసులను బురిడీ కొట్టించాలనుకుంటే చివరకు నవ్వుల పాలు కావాల్సిందేనని హెచ్చరించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడినప్పుడు పోలీసులపై చిందులు తొక్కే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆయన కళ్లకు కట్టారు. ఆ సమయంలో చేసే రచ్చ అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల, మరుసటి రోజు అది వారి ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులు, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఒక ‘మ్యూజియం’లా నిలిచిపోతుందని హెచ్చరించారు. అప్పటి అతి తెలివి వల్ల జీవితాంతం పరువు పోవడం ఖాయమని గుర్తు చేశారు. అంతేకాకుండా, తాగి దొరికితే ప్రియమైన వాహనం ‘డిటెన్షన్ సెంటర్’లో బూట్ క్యాంప్ శిక్షణ పొందాల్సి వస్తుందని (అంటే వాహనం సీజ్ చేస్తామని) వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

చివరగా, బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని, మద్యం సేవిస్తే డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకోవాలని లేదా క్యాబ్ ఆశ్రయించాలని సూచించారు. తాగి వాహనం నడిపి పట్టుబడితే కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని, అక్కడ అసలు లాయర్లు నిజమైన సెక్షన్లు చదువుతుంటే మీ ‘లీగల్ మేధస్సు’ కుప్పకూలిపోతుందని స్పష్టం చేశారు. “హైదరాబాద్ పోలీస్ బోలే తో – జీరో టాలరెన్స్” అనే నినాదంతో మందుబాబులకు మేటర్ సీరియస్ అని సజ్జనార్ గట్టి సంకేతాలు పంపారు.

ANN TOP 10