AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీకి మరో వందే భారత్ రైలు: కేంద్ర సహాయమంత్రి శ్రీనివాసవర్మ

ఏపీకి మరో వందే భారత్ రైలు వస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. త్వరలోనే నరసాపురం నుంచి చెన్నైకి వందే భారత్ రైలును ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతోపాటు నరసాపురం-అరుణాచలం ఎక్స్‌ప్రెస్ సేవలను కూడా క్రమబద్ధీకరించనున్నట్లు హామీ ఇచ్చారు.

 

తన పార్లమెంట్ నియోజకవర్గమైన నరసాపురం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు శ్రీనివాసవర్మ తెలిపారు. నియోజకవర్గంలో రైల్వే, జాతీయ రహదారుల ప్రాజెక్టులపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. రూ.3,200 కోట్ల అంచనా వ్యయంతో 165వ జాతీయ రహదారి విస్తరణకు సంబంధించిన డీపీఆర్ సిద్ధమైందని వెల్లడించారు. పరిపాలన సౌలభ్యం కోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా కొత్త కలెక్టరేట్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని శ్రీనివాసవర్మ తెలియజేశారు.

 

ఇక విశాఖ ఉక్కు కర్మాగారం భవిష్యత్తుపైనా ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందంటూ వస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఈ ఆరోపణలను ఆయన బాధ్యతారహితమైనవిగా అభివర్ణించారు.

 

ప్లాంట్‌ను నష్టాల నుంచి గట్టెక్కించి, తిరిగి లాభాల బాట పట్టించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు. పరిశ్రమ ప్రయోజనాల కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కార్మికులు, ట్రేడ్ యూనియన్ నాయకులందరి సహకారంతో కర్మాగారాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. జీఎస్టీ తగ్గింపు వంటి సాహసోపేత చర్యల ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామని వివరించారు.

ANN TOP 10