తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2025-26 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ లోగోలో అధికారిక రూపాయి చిహ్నాన్ని తొలగించి, దాని స్థానంలో తమిళ అక్షరమైన ‘రు’ ను ప్రవేశపెట్టడం వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయంపై బీజేపీ, విపక్షాలు తీవ్రంగా ప్రతిస్పందించాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తన వైఖరిని ప్రకటించేందుకు స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తమిళ భాషకు మద్దతుగా స్టాలిన్ నిర్ణయం
తమిళనాడు రాష్ట్ర బడ్జెట్ 2025-26 గురించి అధికారిక X (Twitter) ఖాతాలో కీలక ప్రకటన షేర్ చేశారు. “సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా తమిళనాడు విస్తృత అభివృద్ధిని నిర్ధారించడానికి…” అని స్టాలిన్ పేర్కొని ఓ ఫోటో షేర్ చేశారు. అయితే దానిలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం మాత్రం బడ్జెట్ లోగోలో రూపాయి చిహ్నం స్థానంలో తమిళ ‘రు’ చిహ్నాన్ని ఉపయోగించడం.
ప్రశ్నిస్తున్న విపక్షాలు
దీంతో ఈ నిర్ణయం వెనుక స్టాలిన్ అసలు ఉద్దేశం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే, తమిళ భాషకు ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశంతోనే స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. తమిళ ప్రజల అభిమానం పొందడానికి, కేంద్రం మూడు భాషల విధానానికి వ్యతిరేకంగా సందేశం ఇచ్చేందుకు స్టాలిన్ ఇలా చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో బడ్జెట్‌లలో రూపాయి చిహ్నం
2023-24, 2024-25 సంవత్సరాలకు రాష్ట్ర బడ్జెట్‌లో అధికారిక భారత రూపాయి చిహ్నాన్ని లోగోలో ఉపయోగించారు. ఇది IIT గువాహటికి చెందిన ప్రొఫెసర్ ఉదయ కుమార్ రూపొందించారు. ఆయన ఒక మాజీ డీఎంకే ఎమ్మెల్యే కుమారుడు కావడం విశేషం. అయితే ఈ రూపాయి చిహ్నాన్ని తొలగించి ‘రు’ అనే తమిళ అక్షరాన్ని ఉంచడం కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత చూపించడమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
తీవ్రంగా రియాక్టైన బీజేపీ
రూపాయి చిహ్నాన్ని తమిళ అక్షరంతో భర్తీ చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై స్టాలిన్ నిర్ణయాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రూపాయి చిహ్నం భారతదేశ గౌరవానికి ప్రతీక. దేశం మొత్తం ఆ చిహ్నాన్ని అంగీకరించింది. కానీ స్టాలిన్ మాత్రం అధికారిక చిహ్నాన్ని తొలగించడం తగదని, ఇది మూర్ఖత్వానికి, హాస్యానికి సంకేతమని” అన్నామలై అన్నారు. అంతేకాదు మీ తండ్రి డీఎంకే ఎమ్మెల్యే కుమారుడే రూపాయి చిహ్నాన్ని రూపొందించగా, ఇప్పుడు దానిని తొలగించడం ఎంత నైపుణ్యం?” అని స్టాలిన్‌ను ఉద్దేశించి అన్నామలై ఎద్దేవా చేశారు.
తీవ్ర విమర్శలు
బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా కూడా స్టాలిన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భారత రూపాయి చిహ్నాన్ని రూపొందించిన ఉదయ కుమార్ తమిళుడే. ఇప్పుడు తమిళుడే రూపకల్పన చేసిన చిహ్నాన్ని తొలగించడం తమిళులను అవమానించడమేనని పేర్కొన్నారు.
స్టాలిన్ నిర్ణయాన్ని సమర్థించిన డీఎంకే
డీఎంకే మాత్రం స్టాలిన్ నిర్ణయాన్ని సమర్థించింది. డీఎంకే అధికార ప్రతినిధి ఏ. శరవణన్ మాట్లాడుతూ ఇది అధికారిక రూపాయి చిహ్నాన్ని తిరస్కరించడం కాదని, తమిళ భాషకు గౌరవం కల్పించడమే లక్ష్యమన్నారు. తమిళ భాష పరిరక్షణ, సంస్కృతి గౌరవాన్ని కాపాడడం కోసం స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తమిళ ప్రజల భావాలను ప్రతిబింబించడంలో ఇది సరికొత్త నిర్ణయమని వెల్లడించారు.
భాషా రాజకీయం
తమిళనాడు ప్రభుత్వం గతంలో కూడా కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం (NEP)పై వ్యతిరేకత వ్యక్తం చేసింది. మూడుభాషల విధానం అమలుపై స్టాలిన్ ప్రభుత్వానికి అభ్యంతరాలున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ భాషను ముందుకు తేవాలన్న ఉద్దేశంతోనే స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు కూడా గతంలో భాషా పరిరక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవిడీయన్ మోడల్ ను కొనసాగించడంలో భాగంగా తమిళ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని డీఎంకే ప్రభుత్వం భావిస్తోంది.