లైలా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో తాను చేసిన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతినివుంటే క్షమించాలని నటుడు పృథ్వీరాజ్ (Pridhvi Raj) కోరారు. తనకు వ్యక్తిగతంగా ఎవరిపైనా ద్వేషం లేదని అన్నారు. 11 మేకలంటూ చేసిన వ్యాఖ్యలకు వైసీపీకి ఆయన క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు.
‘గోదావరి జిల్లాలో పుట్టి, పెరిగా కాబట్టి మాకు వెటకారం వెన్నతో పెట్టిన విద్య. వ్యక్తిగతంగా నాకు ఎవరిపైనా ద్వేషం లేదు. లైలా సినిమాను కిల్ చేయకండి. సినిమాని గౌరవిద్దాం.. ప్రేమిద్దాం. నాకింత క్రేజ్ వచ్చిందంటే సినిమానే కారణం. నా వల్ల ఈ సినిమా ఇబ్బంది పడకూడదు. లైలాను బాయ్‌కాట్ చేయకండి’ అని పృథ్వీరాజ్ విజ్ఞప్తి చేశారు.
విశ్వక్సేన్కు ‘ఫలక్‌నుమా దాస్’కు మించిన విజయం ఈ సినిమా అందిస్తుందని ఆశిస్తున్నట్లు పృథ్వీ తెలిపరాు. ఓ వ్యక్తి నాతో నీచంగా మాట్లాడాడు. చనిపోయిన మా అమ్మనూ తిట్టాడు. అది అతడి వ్యక్తిత్వం. నా ఆరోగ్యం దెబ్బతినేలా చేశాడు. అతడి గురించి నేను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలూ వెనక్కి తీసుకుంటున్నా అని పృథ్వీ ఆ వీడియోలో పేర్కొన్నారు.
అంతకుముందు తమ సినిమాను బాయ్‌కాట్ చేయొద్దంటూ లైలా హీరో విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పినప్పటికీ సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ప్రచారం ఆగలేదు. ఈ క్రమంలోనే పృథ్వీ తాజాగా తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. రాజకీయాలు మాట్లాడుకోవడానికి చాలా వేదికలు ఉన్నాయని.. అక్కడ మాట్లాడుతానని.. ఇప్పటికైతే సారీ అని అన్నారు. లైలా మూవీ వరకు రాజకీయాలను వదిలేయాలని.. దీన్ని ఇంతటో ముగించాలని పిలుపునిచ్చారు. లైలా చూడండి అని సినిమా అభిమానులకు పృథ్వీ విజ్ఞప్తి చేశారు.
అసలు పృథ్వీ ఏమన్నారంటే?
కాగా, హీరో విశ్వక్ సేన్ నటించిన లైలా ప్రీరిలీజ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ విశేషాలు చెబుతూ 150 మేకల్లో చివరకు 11 మేకలే మిగిలాయని పృథ్వీరాజ్ చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ కొందరు వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించినట్లు పృథ్వీ తెలిపారు.