AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

19న కేసీఆర్ విస్తృతస్తాయి సమావేశం..

పార్లమెంటు ఎన్నికల తర్వాత కాస్త స్తబ్దుగా ఉన్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇక ఫుల్ యాక్టివ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 19వ తేదీన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదేశించారు.

 

ఫిబ్రవరి 19న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి హైదరాబాద్ నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ , ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, డీసీసీబీ, బీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

 

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న క్రమంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతోపాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర కీలక అంశాలపై చర్చించనున్నారు. అంతేగాక, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రధానంగా చర్చించనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

 

ప్రభుత్వం ఇచ్చిన హామీలను సాధించుకుంటూ, తమ హక్కులను తాము కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం కార్యకర్తలు శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు విధానాలపై ఈ విస్తృతస్థాయి సమీక్షా సమావేశంలో చర్చించనున్నారని కేటీఆర్ తెలిపారు. సమగ్ర చర్చ జరిపి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే కీలక సమావేశం కాబట్టి ఆహ్వానితులందరూ ఖచ్చితంగా హాజరు కావాలని కేటీఆర్ స్పష్టం చేశారు.

ANN TOP 10