ఎన్నికల ప్రక్రియ ముగిసి ఫలితాలు ప్రకటించిన తర్వాత కూడా ఈవీఎంలలో (ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్లు) నిల్వ ఉన్న డేటాను తొలగించవద్దని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి (ఈసీ) ఆదేశించింది. ఈవీఎంలలో నిల్వ ఉన్న డేటాపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హరియాణా రాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) మరియు కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేసిన సుప్రీంకోర్టు, ఈవీఎంల డేటాను తొలగించే ప్రక్రియను ప్రారంభించవద్దని ఎన్నికల సంఘానికి స్పష్టంగా తెలిపింది. అదే సమయంలో, ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎంలను ఎలా నిర్వహిస్తున్నారో, ఏ నిర్ణీత ప్రమాణాలను పాటిస్తున్నారో కూడా ఎన్నికల సంఘం వివరించాలని కోరింది.
చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం, “ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిందని భావించి ఈవీఎంలలో ఉన్న డేటాను తొలగించవద్దు. ఏ విధమైన డేటాను కూడా ఈవీఎంల నుండి తొలగించవద్దు. అదే విధంగా, ఏ డేటాను కూడా తిరిగి లోడ్ చేయవద్దు” అని స్పష్టంగా తెలిపింది. ఈవీఎంల డేటా భవిష్యత్తులో అవసరమైన సందర్భాలలో కోర్టుకు సమర్పించాల్సి ఉండటంతో, డేటాను తొలగిస్తే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది.
ఓటమి పాలైన అభ్యర్థులు ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరగలేదని ధృవీకరించాలని కోరిన సందర్భంలో, ఒక ఇంజనీర్ సహాయంతో ఈ విషయాన్ని ధృవీకరించాలని కోర్టు తెలిపింది. ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్ను సీల్ చేసి, కనీసం 45 రోజుల పాటు భద్రపరచాలని కోర్టు సూచించింది. ఫలితాలు ప్రకటించిన తర్వాత, అభ్యర్థులు ఏడు రోజుల్లోగా తమ అభ్యంతరాలను తెలియజేయాలని కోర్టు తెలిపింది. అటువంటి సందర్భాలలో, ఇంజినీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేసిన మెమొరీని తనిఖీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ వెరిఫికేషన్ ప్రక్రియకు అయ్యే ఖర్చులను అభ్యంతరాలు తెలిపిన అభ్యర్థులే భరించాలని కోర్టు తెలిపింది. ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే, ఖర్చులు తిరిగి ఇవ్వాలని కూడా సూచించింది.
అలాగే, ఈవీఎంలలోని మైక్రో కంట్రోలర్ మరియు మెమొరీలో ఉన్న డేటాను తొలగించేందుకు ఎన్నికల సంఘం ఏ విధానం అనుసరిస్తోందో 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
గతంలో, ఈవీఎం-వీవీప్యాట్ క్రాస్ వెరిఫికేషన్ విషయంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్లలో (EVM) నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ (VVPAT) స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ఇదే కాకుండా నవంబర్ 2024లో ఈవీఎం మెషీన్లకు బదులుగా బ్యాలెట్ పేపర్లను వినియోగించాలని ప్రజాశాంతి పార్టీ నాయకుడు కె.ఎ. పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ పిటిషన్‌ని కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు పీ.బి. వరలా, విక్రమ్ నాథ్ లు.. “ట్యాంపరింగ్ జరిగిందని మీరు గెలిచినప్పుడు ఇలాగే అనుమానాలు వస్తాయా?” అని ప్రశ్నించారు. “మీరు ఎన్నికల్లో గెలిచినప్పుడు, ఈవీఎం ట్యాంపరింగ్ జరగదు. మీరు ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయబడతాయా?” అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు బ్యాలెట్ పేపర్‌ను మళ్లీ ప్రవేశపెట్టడం తప్పనిసరి అని, ఈవీఎం ట్యాంపరింగ్‌కు గురికావచ్చని కె.ఎ. పాల్ తన పిటిషన్‌లో తెలిపారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చనే ఎలాన్ మస్క్ వాదనను కూడా కె.ఎ. పాల్ ఉదహరించారు