రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన అఘోరీ మాత ఆత్మార్పణ కథ సుఖాంతమైంది. దీంతో పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుసనపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్న అఘోరీమాతను పోలీసులు తెల్లవారుజామున క్షేమంగా తెలంగాణ సరిహద్దులు దాటించి మహారాష్ట్రకు తరలించారు. కొండగట్టు, వేములవాడ దేవాలయాలను దర్శించుకొని ముత్యాలమ్మ టెంపుల్ కి ఆత్మార్పణ కోసం వెళుతున్న అఘోరీ మాతను పోలీసులు సిద్దిపేటలో ఆధీనంలోకి చేసుకొని పోలీస్ ఎస్కార్ట్ మధ్య నెన్నెల మండలం కుసనపల్లి లోని సొంత ఇంటికి తరలించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో అఘోరి మాత వ్యవహారం ఉత్కంఠ రేపింది. అఘోరీ మాతను కాపాడేందుకు పోలీసులు కంటికి రెప్పలా ఇంటి వద్ద కాపలా కాశారు.
అఘోరీ మాతను చూడడానికి ప్రజలకు, మీడియాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆమె ఇంటి వద్ద మూడు రోజులుగా గట్టి పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో ఆమె ఇంటి వద్ద ఉత్కంఠ నెలకొంది. అఘోరి మాత ప్రకటించిన ఆత్మార్పణ నుంచి పోలీసులు ఆమెను కాపాడారు. ఇదే క్రమంలో అఘోరి మాత ఆదేశాల మేరకు ఆమె తల్లిదండ్రులు మీడియా నుంచి ముప్పును నివారించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను కలిసి వేడుకున్నారు. మీడియా ముందుకు రావడం అఘోరీ మాత విముఖత చూపింది. భారీ పోలీస్ ఎస్కార్ట్ మధ్య మీడియా కంట కనబడకుండా మహారాష్ట్రకు తరలించారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షణలో నేన్నెల ఎస్సె ప్రసాద్ పోలీసు బలగాలతో అఘోరీ మాత వెంట వెళ్లి మహారాష్ట్రలో విడిచిపెట్టారు. రాష్ట్రంలో మూడు రోజులుగా నెలకొన్న టెన్షన్ కు తెరపడింది. అఘోరి మాత కథ సుఖాంతం కావడంతో ఒక్కసారిగా పోలీసు యంత్రాంగం, తల్లిదండ్రులు ప్రజలు రిలీఫ్ అయ్యారు.