AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. ఢిల్లీ తరహాలోనే వాయు కాలుష్యం..

 తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో (Hyderabad) డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఢిల్లీ తరహాలోనే హైదరాబాద్‌లో వాయు కాలుష్యం పెరిగిపోతుండటం నగరవాసులను కలవరపెడుతోంది. హైదరాబాద్‌లో వాయు కాలుష్యం కారణంగా గత దశాబ్దకాలంలో 6000 మందికి పైగా మరణాలు సంభవించాయి. లాన్సెట్ ప్లానెట్ హెల్త్ సంస్థ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్‌లో ఒక్క 2023లోనే వాయు కాలుష్యానికి సంబంధించి మరణాల సంఖ్య 1,597గా ఉంది. వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న టాప్ -10 నగరాలలో హైదరాబాద్ ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీ నంబర్ వన్ స్థానంలో ఉండగా.. తరువాత స్థానాల్లో ముంబయి, బెంగళురు, పుణె, చెన్నై నగరాలు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వివరాల ప్రకారం హైదరాబాద్‌లోని సనత్ నగర్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కొంపల్లి, ఆబిడ్స్, గచ్చి బౌలి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో అధిక వాయు కాలుష్యం ఉంది. గత గంటల సమయంలో పీఎం 2.5 కాలుష్యాలు 60 పాయింట్లలోపు ఉండాల్సి ఉండగా సోమాజిగూడలో 105, హెచ్‌సీయూ, న్యూమలక్‌పేటలలో 99, హైదరాబా ద్‌ యూఎస్‌ కాన్సులేట్‌ వద్ద 92, జూపార్క్‌ వద్ద 91, కేపీహెచ్‌బీ ఫేజ్‌–2 వద్ద 84, కోకాపేట వద్ద 81 పాయింట్లుగా నమోదు అయ్యింది. దీపావళి టపాసులతో వాయు నాణ్యతలో క్షీణత ఏ మేరకు జరిగిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. పొల్యూషన్ వల్ల దీర్ఘకాలిక రోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గుండె, శ్వాసకోశ, మూత్రపిండాలు, కాలేయం, ఇతర దీర్ఘకాలిక జబ్బులు, సమస్యలున్న వారిపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపనుంది. అప్పర్‌ రెస్పిరేటరీ సమస్యలు, ముక్కులు కారడం, తుమ్ములు, గొంతు పొడిబారడం, గొంతు నొప్పి వల్ల కేసులు పెరుగుతున్న పరిస్థితి.

ANN TOP 10