లీగల్ నోటీసులకు భయపడేది లేదు.. నా వ్యాఖ్యల్లో తప్పేలేదు.. నాకే కేటీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ రివర్స్ అటాక్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మాజీ మంత్రి కేటీఆర్ తనకు పంపిన లీగల్ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు.
ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి, బండి సంజయ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందిస్తూ.. బీఆర్ఎస్ పాలనలో ట్యాపింగ్ జరిగిందని విమర్శలు చేశారు బండి సంజయ్. అలాగే ఇటీవల గ్రూప్స్ పరీక్షలు, మోకీలా డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై, కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఈ విషయంపై అదేరోజు తాను నోటీసులకు సమాధానం ఇస్తానంటూ.. మంత్రి కూడా ప్రకటించారు.
తాజాగా తన న్యాయవాది నవీన్ ద్వారా నోటీసులకు సమాధానాన్ని కేంద్ర మంత్రి పంపించారు. తనకు ఉద్దేశపూర్వకంగా కేటీఆర్ నోటీసులు పంపించారని, ఎటువంటి ఆధారాలు లేకుండా పంపినట్లు రిప్లై నోటీసులో పేర్కొన్నారు. ఇటీవల మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని నాయకులతో సమావేశమైన కేటీఆర్ మాట్లాడుతూ.. ఒకరిద్దరి ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉండవచ్చని స్వయంగా ప్రకటించినట్లు, తాను అదే మాటలను చెప్పినట్లు బండి సంజయ్ తెలిపారు.









