AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ అధికారిక చిహ్నానికి తుదిరూపు.. సీఎం రేవంత్‌ సమీక్ష

మేధావులతో జోరుగా చర్చ
కొత్త లోగోపై సర్వత్రా ఉత్కంఠ

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2వ తేదీన అధికారికంగా కొత్త చిహ్నం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. దీంతో కొత్త చిహ్నంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సీఎం రేవంత్‌ రెడ్డి బుధవారం సమీక్ష చేశారు. జూబ్లీహిల్స్‌ లోని తన నివాసంలో కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్‌ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు హాజరయ్యారు. పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనుందని తెలుస్తోంది.

కాగా చిహ్నం మార్పు ప్రకటనతో కొత్త లోగో ఎలా ఉండబోతున్నది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికార కొత్త చిహ్నం ఇదే అంటూ మూడు నమూనాలకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఈ మూడు లోగోలు వృత్తాకారంలో ఉండగా మొదటి లోగో మధ్యలో పూర్ణకుంభం, పై భాగంలో మూడు సింహాల రాజముద్ర, కింది భాగంలో చార్మినార్‌ బొమ్మ ఉంది. పూర్ణకుంభానికి ఇరువైపులా తంగేడు ఆకులు ఉన్నాయి. ఇక రెండో లోగో మధ్యలో తెలంగాణ మ్యాప్, పై భాగంలో మూడు సింహాల రాజముద్ర, దిగువ భాగాన హుస్సేన్‌ సాగర్‌ లోని గౌతమ బుద్ధుని విగ్రహం బొమ్మ ఉంది. తెలంగాణ మ్యాప్‌ కు ఇరువైపులా తంగేడు ఆకులు ఉన్నాయి. ఇక మూడో మ్యాప్‌ పై భాగాన మూడు సింహాలతో రాజముద్ర, మధ్యలో ప్రకాశిస్తున్న సూర్యుడు దాని పై భాగాన రావి ఆకులు, దిగువన ప్రగతి చక్రం ఉన్నాయి.

అయితే వైరల్‌ అవుతున్న మూడు లోగోల్లోనూ తెలంగాణ ప్రభుత్వం అని ఇంగ్లీష్, తెలుగు, ఉర్దుతో పాటు హిందీ భాషలోను రాశారు. ప్రస్తుతం ఉన్న లోగోలో హిందీ లేదు. అలాగే ప్రస్తుత చిహ్నం కేవలం గోల్డ్, గ్రీన్‌ రెండు రంగులతోనే రాజముద్రను పూర్తి చేయగా కొత్తగా వైరల్‌ అవుతున్న చిహ్నం ఫొటోలు మాత్రం మల్టిపుల్‌ కలర్స్‌ లో దర్శనం ఇస్తున్నాయి. ఇవి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం రూపొందించిన అధికారిక నమూనాలేనా లేక సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి సమీక్ష అనంతరం ఫైనల్‌ లోగో విషయంలో ఓ క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

ANN TOP 10