తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫ్యూచర్ సిటీకి ప్రతిబింబంగా నిలవనున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరుల సమక్షంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు.
2025 సెప్టెంబర్ 28న..
హైదరాబాద్ కు అనుసంధానంగా మరో నగరాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో రేవంత్ సర్కార్.. ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే మీర్ ఖాన్ పేట్ లో నిర్మించిన ఎఫ్ సీడీఏ భవనాన్ని రేవంత్ ప్రారంభించారు. అయితే ఈ భవనం నిర్మాణానికి 2025 సెప్టెంబర్ 28న సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. అదే ఏడాది డిసెంబర్ లో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. కేవలం 6 నెలల్లోనే ఈ ఎఫ్ సీడీఏ భవనాన్ని పూర్తి చేయడం విశేషం.
40-60 కి.మీ దూరంలో..
ఇదిలా ఉంటే ప్రపంచ స్థాయి గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ సంకల్పించారు. ఇందులో భాగంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు 40-60 కి.మీ దూరంలో దీనిని నిర్మించ తలపెట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీ పరిధిలోకి మీర్‌ఖాన్‌పేట్, కడ్తాల్, అమంగల్, కందుకూరు, తలకొండపల్లి, మహేశ్వరం తదితర ప్రాంతాలతో పాటు రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని కొన్ని ఏరియాలను తీసుకొచ్చింది.
కాగా ఎఫ్ సీడీఏ భవనం ప్రారంభోత్సవానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా కీలక పోస్ట్ పెట్టారు. ఆధునిక భారత్ కు నూతన సిటీగా భారత్ ఫ్యూచర్ సిటీ ఉండనున్నట్లు పేర్కొన్నారు. దీనిని ప్రపంచంలోని గొప్ప నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సాంకేతిక సుస్థిరాభివృద్ధికి ప్రతీకగా ఫ్యూచర్ సిటీ మారబోతోందని రేవంత్ చెప్పుకొచ్చారు. కాగా, రూ.20 కోట్లతో 15 వేల చదరపు అడుగల విస్తీర్ణంలో FCDA భవనాన్ని ప్రభుత్వం నిర్మించడం గమనార్హం.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
రేపటి భవిష్యత్తుకు ఈనాడే పునాదులు వేసి ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించబోతున్నాంమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరానికి గొప్ప చరిత్ర ఉంది. 200 యేళ్ల క్రితం హైదరాబాద్ ను విస్తరించడం వల్ల సికింద్రాబాద్‌తో కలిసి జంట నగరాలుగా విలసిల్తుతున్నాయి. రాష్ట్రానికి 60 శాతం ఆదాయం ఇక్కడి నుంచి వస్తోందని అన్నారు. బంగారానికి కంటే రంగారెడ్డి జిల్లా భూములకు విలువ ఎక్కువ. 1908 లో తుఫాన్ వచ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోతే ఆ నాటి నిజాం నవాబు మూసీ నది పైన నిర్మాణాలు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో యుద్ధ సామాగ్రిని ఉంచడం వల్ల శత్రు దుర్భేద్యంగా మారింది. ఆ నాటి పాలకులు సైబరాబాద్ ను నిర్మించి గొప్ప నగరాన్ని ప్రపంచానికి అందించారని అన్నారు.
ఫామ్ హౌస్‌లో మారీచుడు..
ఆ నాడు కూడా అనేక కుట్రలు, కుతంత్రాలు చేశారు. మూసీలో మురికి కంటే ఎక్కువ విషాన్ని చిమ్మారు. ఆ నాటి పాలకులు హైటెక్ సీటీ, అవుటర్ రింగ్, అంతర్జాతీయ ఎయిర్ పోర్టు, జీనోమ్ వ్యాలీ లాంటి తీసుకురాకపోతే ఈ నాడు 10 లక్షల మందికి ఉపాధి లభించేదా అని అన్నారు. రావణాసురుడు, శుక్రాచార్యుడు, మారీచుడు, సుభావుడు లా ఆ నాడు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు శుక్రాచార్యుడు ఫామ్ హౌస్‌లో ఉండి మారీచుడు, సుభావుడిని పంపించాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని పెద్ద రాక్షసుడు, చిన్న రాక్షసులు అంటున్నారు. ప్రపంచానికి ఒక దిక్సూచిగా ఫ్యూచర్ సిటీని గొప్ప నగరంగా తీర్చిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందని రేవంత్ అన్నారు. కళ్లలో నిప్పులు పోసుకుని, కడుపులో విషం నిప్పు కొని అమెరికాలో కూడా ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్నారని ఫైర్ అయ్యారు.
ప్రపంచానికి దిక్సూచిగా..
ఫ్యూచర్ సిటీని ప్రపంచానికి గొప్ప నగరంగా రాణిస్తుందనడంలో అనుమానం లేదని, అడ్డుపడిన వాళ్లను అడ్డంగా తొక్కుకుంటు ఈ ప్రాంతం వాళ్లే వెళ్తారని అన్నారు. ఈ నగరాన్ని ఇక్కడి వాళ్లే కాపాడుకుంటారు. ప్రపంచానికి దిక్సూచిగా ఈ ప్రాంతం ఉంటుంది. కాలుష్య రహిత గొప్పనగరంగా తీర్చిదిద్దతామని అన్నారు. వీలైనప్పుడల్లా ఫ్యూచర్ సిటీ అథారిటీ కార్యాలయానికి వస్తానని, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు వారానికోసారి ఇక్కడికి వస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.








