టెక్నాలజీ బదిలీకి ఇన్-స్పేస్ గ్రీన్ సిగ్నల్
చంద్రయాన్ ప్రయోగంతో గుర్తింపు పొందిన రాకెట్
భవిష్యత్ మిషన్లపై ఇస్రో ప్రత్యేక దృష్టి
టెండర్లలో పాల్గొనేందుకు కఠినమైన నిబంధనలు
గ్లోబల్ మార్కెట్‌లో భారత్ వాటా పెరిగే అవకాశం
భారత అంతరిక్ష రక్షణ రంగంలో చారిత్రాత్మక సంస్కరణకు కేంద్ర ప్రభుత్వం తెరలేపింది. చంద్రయాన్-3 మిషన్‌ను అత్యంత విజయవంతంగా జాబిల్లిపైకి మోసుకెళ్లిన ఇస్రో భారీ రాకెట్ ఎల్‌వీఎమ్3 సాంకేతికతను, నిర్వహణ బాధ్యతలను పూర్తిగా ప్రైవేట్ రంగానికి బదిలీ చేయాలని నిర్ణయించింది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ప్రభుత్వ నోడల్ సంస్థ ‘ఇన్-స్పేస్’ ఈ మేరకు అధికారికంగా ‘ఆసక్తి వ్యక్తీకరణ’ పత్రాలను ఆహ్వానించింది. అంతకుముందు చిన్న ఉపగ్రహాలను మోసే ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కు బదిలీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా అత్యంత బరువైన రాకెట్‌ను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడానికి సిద్ధమైంది.
భారీ బరువులను మోసుకెళ్లే అసాధారణ సామర్థ్యం కారణంగా ఈ రాకెట్‌ను అంతరిక్ష రంగంలో ‘బాహుబలి’ అని పిలుస్తారు. ఈ మూడు దశల రాకెట్ ద్వారా ఇస్రో ఎన్నో స్వదేశీ, అంతర్జాతీయ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. వన్‌వెబ్ శాటిలైట్ నెట్‌వర్క్‌ను నింగిలోకి పంపి అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్‌లోనూ ఈ రాకెట్ తన సత్తా చాటుకుంది. భవిష్యత్తులో భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే గగన్‌యాన్ మిషన్ కోసం కూడా ఈ రాకెట్ ప్రత్యేక వెర్షన్‌ను వాడుతున్నారు.
సాధారణ రాకెట్ల ఉత్పత్తి, ప్రయోగాల వంటి రెగ్యులర్ పనుల కోసం తన సమయాన్ని, వనరులను కేటాయించకుండా.. ఇస్రోను మరింత పెద్ద ప్రాజెక్టులపై కేంద్రీకరించేలా చేయడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గగన్‌యాన్, చంద్రయాన్-4, చంద్రయాన్-5 వంటి ప్రతిష్ఠాత్మక మిషన్లతో పాటు శుక్రుడిపైకి చేపట్టే ప్రయోగాలపై ఇస్రో శాస్త్రవేత్తలు దృష్టి పెట్టేందుకు ఈ సంస్కరణలు ఎంతగానో దోహదపడతాయి. అదే సమయంలో అంతర్జాతీయ కమర్షియల్ మార్కెట్‌లో భారతదేశ వాటాను పెంచడానికి ఈ ప్రైవేటీకరణ ఉపయోగపడుతుంది.
ఎల్‌వీఎమ్3 రాకెట్ తయారీ, మార్కెటింగ్ బాధ్యతలను దక్కించుకునే కంపెనీలకు ఇస్రో 42 నెలల పాటు లేదా రెండు రాకెట్లను విజయవంతంగా ప్రయోగించే వరకు పూర్తి సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. అయితే ఈ టెండర్లలో పాల్గొనే భారతీయ కంపెనీలకు ప్రభుత్వం కఠిన నిబంధనలను విధించింది. సదరు సంస్థ కనీసం ఏడేళ్లుగా వ్యాపారంలో ఉండాలి. అంతరిక్ష లేదా ఏరోస్పేస్ రంగంలో ఐదేళ్ల అనుభవం తప్పనిసరి. గత ఐదేళ్లలో ఏవైనా మూడేళ్ల సగటు వార్షిక టర్నోవర్ రూ.800 కోట్లు దాటాలి. లేదా ఆ కంపెనీ మార్కెట్ విలువ కనీసం రూ. 2,000 కోట్లు ఉండాలి.
ఇది విజయవంతమైతే అంతర్జాతీయంగా భారీ రాకెట్లను ప్రయోగించే అంతరిక్ష వాణిజ్య మార్కెట్లో భారతదేశ ప్రైవేట్ కంపెనీలు అగ్రగామిగా ఎదిగేందుకు మార్గం సుగమం అవుతుంది.








